నిలిచిన ప్రగతి.. కానరాని పురోగతి
అభివృద్ధికి నోచుకోని రామాయంపేట మున్సిపాలిటీ
ట్యాంక్‌బండ్ పనులు ఏవీ?
2018లో మినీ ట్యాంక్‌బండ్ నిర్మాణం కోసం రూ. 3.20 కోట్లు మంజూరయ్యాయి. వీటితో కట్ట వెడల్పు చేయించిన అధికారులు కల్వర్టు నిర్మించి వదిలేశారు. ముఖ్యంగా పట్టణంలోని మురుగు నీటిని చెరువులోకి వదులుతుండడంతో నీరంతా కలుషితమై రంగు మారింది. చెరువులోని నీటిని శుద్ధీకరణ చేయకపోవడంతో ఈ ప్రాంత ప్రజలకు దుర్వాసన వెదజల్లుతోంది. రోడ్డును ఆను కొని ఉన్న చెరువులోకి తరచూ వాహనాలు దూసుకెళ్తున్నాయి. చెరువు కట్టపై కంకర పరుచుకొని కాలినడకన వెళ్లడానికి గాను స్థానికులు ఇబ్బందులపాలవుతున్నారు.
రామాయంపేట(మెదక్): ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత చేరువ కావాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం పాలనా వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా 2018లో రామాయంపేట పట్టణం మున్సిపాలిటీగా రూపాంతరం చెందింది. తద్వారా తమ సమస్యలకు సత్వర పరిష్కారం లభిస్తుందని పట్టణ ప్రజలు సంబరపడ్డారు. అయితే రామాయంపేట మేజర్ పంచాయతీగా ఉన్న సమయంలో జరిగిన అభివృద్ధి తప్ప మున్సిపాలిటీ అయిన తర్వాత ఎలాంటి ప్రగతికి నోచుకోలేదు. అభివృద్ధి పనులన్నీ అసంపూర్తిగా నిలిచిపోయాయి. వాటిని పూర్తిచేయించే విషయమై ఎవరూ పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పత్తాలేని మినీ స్టేడియం
రామాయంపేటలో మినీ స్టేడియం నిర్మాణానికి నాలుగేళ్ల క్రితం రూ. 2.65 కోట్లు మంజూరు కాగా జాతీయ రహదారి పక్కనే స్థలం ఎంపిక చేశారు. సంబంధిత కాంట్రాక్టర్ సదరు స్థలాన్ని చదును చేసి బిల్లులు రూ. 20 లక్షలు డ్రా చేసుకొని వెళ్లిపోయాడు.
తహసీల్దార్ కార్యాలయం శిథిలం
తహసీల్దార్ కార్యాలయం పూర్తిగా శిథిలమవడంతో దాని స్థానంలో మరో భవన నిర్మాణానికి ఆరేళ్ల క్రితం రూ. 3.5 కోట్లు మంజూరయ్యాయి. సంబంధిత కాంట్రాక్టర్ భవనం స్లాబ్ వేయించి మిగితా పనులను మధ్యలోనే వదిలేశారు. దీంతో నిర్మాణ పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. ప్రస్తుతం కార్యాలయం కొనసాగుతున్న పాత భవనం పూర్తిగా శిథిలమై ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.
నిలిచిన మార్కెట్ నిర్మాణం
రామాయంపేటలో మూడేళ్ల క్రితం వెజ్, నాన్‌వెజ్ మార్కెట్ నిర్మాణం కోసం ప్రభుత్వం రూ. 3 కోట్లు మంజూరు చేసింది. కాగా ఎంపీపీ కార్యాలయం ఆవరణలో పనులు ప్రారంభించి పిల్లర్లస్థాయిలోనే పనులు నిలిపివేశారు. ప్రస్తుతం మార్కెట్ ఇరుకై న ప్రదేశంలో కొనసాగుతుండగా, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గతంలో రూ. 50 లక్షలతో నిర్మించిన రైతుబజార్ సైతం నిరూపయోగంగా మారింది.
జాడలేని బస్సు డిపో
రామాయంపేటకు 15 ఏళ్ల క్రితం బస్ డిపో మంజూరు కాగా స్థానికులు విలువైన స్థలాన్ని ఆర్డీసీ పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. చందాలు వేసుకొని స్థలాన్ని చదును చేసి హద్దులు పాతారు. డిపో మంజూరు కాకపోవడంతో ఆ స్థలం నిరూపయోగంగా మారి ఆక్రమణకు గురవుతోంది.
రామాయంపేట వ్యూ..
ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లాం
అభివృద్ధిలో రామాయంపేట వెనుకబడిపోయింది. చాలా వరకు పనులు అసంపూర్తిగా నిలిచిపోయా యి. ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌పై పట్టణ ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. మొదటగా పట్టణంలోని ప్రధాన రహదారికి మరమ్మతులు చేయాల్సి ఉంది. ఈవిషయం ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లాం.
– జితేందర్‌గౌడ్, మున్సిపల్ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment