చర్చి అద్భుతం
● ప్రజల ఆకలి తీర్చిన కట్టడం
● సమైక్యతకు ప్రతీక
● విశ్వాసం, పరివర్తనానికి నాంది
● కొల్చారం గురుకుల విద్యార్థులతో
మాటామంతి
● ఉత్సాహంగా సాగిన గవర్నర్ పర్యటన
మెదక్‌జోన్/చిలప్‌చెడ్(నర్సాపూర్): గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటన ఆదివారం జిల్లాలో ఉత్సాహంగా సాగింది. మొదట ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ చర్చి శతాబ్ధి ఉత్సవాల్లో పాల్గొన్నారు. చర్చి నిర్వాహకులు ఆయనను ఘనంగా సన్మానించారు. ప్రత్యేక ప్రార్థనలు చేసి ఆశీర్వదించారు. ఈసందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. కరువు కాటకాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్న సమయంలో చర్చి నిర్మాత చార్లెస్ వాకర్ ప్రజల ఆకలితీర్చి ఈ అద్భుత కట్టడానికి పూనుకోవడం గొప్ప విషయమన్నారు. సమాజం కలిసికట్టుగా సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచిందని కొనియాడారు. ఇది మరో శతాబ్ధం వరకు సేవ, విశ్వాసం, పరివర్తన ప్రభావానికి నాంది కావాలని పిలుపునిచ్చారు. అనంతరం క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
పిల్లలంటే చాలా ఇష్టం
కొల్చారం మండల కేంద్రంలోని గురుకుల సంక్షేమ పాఠశాల (బాలికల), కళాశాలను గవర్నర్ సందర్శించారు. ముఖాముఖి చర్చలో పాల్గొని విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. అనంతరం వారితో కలిసి భోజనం చేశారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు చక్కటి ప్రశ్నలు వేశారన్నారు. పిల్లలతో గడపటం, రాయడం, చదవడం తనకు ఇష్టమన్నారు. దేశ భవిష్యత్‌కు విద్యార్థులు పునాదిలాంటివారని, సమస్యలను అధిగమిస్తూ లక్ష్యాలను సాధించాలన్నారు. చిన్నతనం నుంచే క్రమశిక్షణతో ఉంటూ భవిష్యత్‌కు మార్గనిర్దేశం చేసుకోవాలని సూచించారు. గురుకుల పాఠశాలలు విద్యార్థులకు బంగారు భవిష్యత్ అందించాలన్నారు. మెదక్ ఎంపీ రఘునందన్‌రావు మాట్లాడుతూ.. దేశప్రగతి విద్యార్థుల తరగతి గదిలోనే అన్న వివేకానందుడి మాటను గుర్తు చేశారు. విద్యార్థులు ఇష్టంతో విద్యను అభ్యసించాలని సూచించారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు పట్టుదల, క్రమశిక్షణతో ఉన్నతస్థాయికి ఎదగాలని అన్నారు. కార్యక్రమంలో గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్, కలెక్టర్ రాహుల్‌రాజ్, ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, రెసిడెన్షియల్ స్కూల్స్ సెక్రటరీ అలుగు వర్షిణి, అదనపు కలెక్టర్ నగేష్, గురుకుల పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment