పర్యావరణ పరిరక్షణకు ఆ పల్లె నడుం బిగించింది. ప్లాస్టిక్ రహితంగా నిలిచి అధికారులు, ప్రజాప్రతినిధుల మన్ననలు పొందుతోంది. 15 ఏళ్లుగా మద్యపాన నిషేధం అమలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. వందశాతం మరుగుదొడ్ల నిర్మాణంతో స్వచ్ఛతను చాటింది. గ్రామస్తుల సమష్టి కృషితో ప్రగతి బాటలో పయనిస్తున్న గూడెంగడ్డ గ్రామంపై ప్రత్యేక కథనం..
మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలోని గూడెంగడ్డ గ్రామం అన్నిరంగాల్లో ఆదర్శంగా నిలుస్తోంది. 2024 సెప్టెంబర్ 17వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు చేపట్టిన స్వచ్ఛతాహీ సేవ కార్యక్రమంలో భాగంగా అధికారులు గ్రామస్తులకు ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పించారు. ప్లాస్టిక్‌తో జరిగే అనర్థాలను సమగ్రంగా వివరించారు. దీంతో గ్రామస్తులంతా ఐక్యత చాటి ప్లాస్టిక్‌ను నిషేధిస్తామని తీర్మానించారు. అనుకున్నదే తడవుగా ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా తీసుకోవాల్సిన చర్యలపై పంచాయతీ కార్యదర్శి నగేష్‌తో చర్చించారు. గ్రామస్తుల ఐక్యతను చూసి ముచ్చటపడిన ఆ అధికారి తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.
తక్షణం రూ. 35 వేలతో 100 స్టీల్ ప్లేట్లు, 100 గ్లాసులు, 20 బాటిల్స్.. ఇతర వస్తువులను సొంత నిధులతో కొనుగోలు చేసి గ్రామ పంచాయతీలో స్టీల్ బ్యాంకు ఏర్పాటు చేశారు. దీనికి తోడు తాను చదువుకున్న పదో తరగతి బ్యాచ్ విద్యార్థులతో గ్రామానికి కావాల్సిన జూట్ బ్యాగుల కోసం నిధులను సమకూర్చారు. గ్రామంలో శుభ, అశుభ కార్యక్రమాలు జరిగినప్పుడు పంచాయతీలో ఏర్పాటుచేసిన స్టీల్ బ్యాంకు ద్వారా ఉచితంగా ప్లేట్లు, గ్లాసులు, ఇతర వంటపాత్రలను అందజేస్తున్నారు.
వారు కార్యక్రమం ముగిసిన తర్వాత శుభ్రం చేసి తిరిగి స్టీల్ బ్యాంకుకు అప్పగిస్తున్నారు. కూరగాయలు, నిత్యావసర సరుకులతో పాటు ఇతర వస్తువులు కొనుగోలు కోసం వెళ్లినప్పుడు జూట్ బ్యాగులను వినియోగిస్తున్నారు. చికెన్, మటన్‌ను స్టీల్ బాక్సులలో తెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం గ్రామంలో ప్లాస్టిక్ నిషేధం పకడ్బందీగా కొనసాగుతోంది.
15 ఏళ్లుగా మద్యపాన నిషేధం
15 ఏళ్ల క్రితం మద్యపాన నిషేధంపై శపథం చేసి నేటికీ అమలు పరుస్తున్నారు. గ్రామంలో మద్యం తాగడం, అమ్మడం జరగకుండా చూసుకుంటున్నారు. గ్రామంలో 180 నివాస గృహాలు ఉండగా 700కు పైగా జనాభా ఉంటున్నారు. వీరిలో సన్న, చిన్నకారు రైతులతో పాటు రోజువారీ కూలీలు ఉన్నారు. రైతులు వరి, మొక్కజొన్న, కూరగాయలు పండిస్తూ పంటను సొంతగా మార్కెట్లకు తరలించి విక్రయించుకుంటారు. పనిలేని సమయంలో పరిసర గ్రామాలకు కూలీ పనులకు వెళుతూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఓవైపు కుటుంబ పోషణతో పాటు గ్రామాభివృద్ధికి ఐకమత్యంగా ఉంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
స్వచ్ఛతకు పెద్దపీట
గూడెంగడ్డ గ్రామస్తులు స్వచ్ఛభారత్‌లో భాగంగా బహిరంగ ప్రదేశాల్లో మూత్ర, మల విసర్జన చేయకుండా ప్రతి కుటుంబం మరుగుదొడ్డి నిర్మించుకుంది. ప్రజలు తడి, పొడి చెత్తను వేరు చేసి కార్మికులకు అందజేస్తున్నారు.
ప్లాస్టిక్ వస్తువులు వాడం
పా్లస్టిక్‌తో జరిగే నష్టాలను అధికారుల ద్వారా తెలుసుకున్నాం. అప్పటి నుంచి ప్లాస్టిక్‌ను వాడకుండా జాగ్రత్త పడుతున్నాం. పంచాయతీలో ఏర్పాటు చేసిన స్టీల్ బ్యాంక్ నుంచి శుభకార్యాలకు కావాల్సిన వంట పాత్రలు తెచ్చుకొని శుభ్రం చేసి ఇస్తున్నాం.
– అమత, గ్రామస్తురాలు
పర్యావరణ పరిరక్షణ కోసమే
పర్యావరణ పరిరక్షణ కోసం నా వంతుగా కృషి చేస్తున్నా. గ్రామంలో ఎక్కడా ప్లాస్టిక్ కవర్లు కనిపించకుండా చర్యలు తీసుకుంటున్నా. గూడెంగడ్డ ప్లాస్టిక్ నిషేధంతో పాటు పరిసరాల పరిశుభ్రత, మధ్యపాన నిషేధంతో జిల్లాలోనే ఆదర్శంగా నిలిచింది.
– నగేష్, పంచాయతీ కార్యదర్శి
సమష్టి కృషితోనే సాధ్యం
సమష్టి కృషితోనే గూడెంగడ్డ గ్రామంలో ప్లాస్టిక్ నిషేధం పక్కాగా అమలవుతోంది. గ్రామస్తుల ఐక్యత, మండల, గ్రామస్థాయి అధికారుల సహకారంతోనే ఇది సాధ్యమైంది.
– మధులత, ఎంపీడీఓ నర్సాపూర్
Comments
Please login to add a commentAdd a comment