అర్హులందరికీ రేషన్ కార్డులు
కలెక్టర్ రాహుల్‌రాజ్
పక్కాగా అర్హుల ఎంపిక: అదనపు కలెక్టర్
హవేళిఘణాపూర్(మెదక్): అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు అందజేస్తామని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. ఆదివారం మెదక్ మండలం పాతూర్‌లో క్షేత్రస్థాయిలో సర్వేను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు రేషన్‌కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అన్నారు. ఈనెల 21 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించనున్న గ్రామ సభలలో దరఖాస్తులు స్వీకరించడంతో పాటు ప్రజాపాలనలో వచ్చిన వాటిని సైతం పరిశీలించాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందన్నారు. ప్రస్తుత రేషన్ లబ్ధిదారుల జాబితా తుది జాబితా కాదని స్పష్టం చేశారు. ఈనెల 26 నుంచి ప్రారంభించనున్న నాలుగు పథకాలపై గ్రామ సభలలో ప్రజాభిప్రాయలు తీసుకుంటామని చెప్పారు. గ్రామ సభలు, ప్రజాపాలన సేవా కేంద్రాలలో కొత్తగా తీసుకున్న దరఖాస్తులు, ఎంపీడీఓ కార్యాలయాల్లో ఇప్పటికే ఉన్న వాటిని పరిశీలించిన తర్వాతే లబ్ధిదారుల తుది జాబితా ప్రకటిస్తామని వివరించారు. ఇంటి స్థలం ఉన్నవారు, లేని వారి రెండు జాబితాలను గ్రామ సభలలో ప్రదర్శించాలని సిబ్బందికి సూచించారు. వ్యవసాయ యోగ్యమైన ప్రతి భూమికి రైతు భరోసా కింద ఎకరానికి ఏడాదికి రూ. 12 వేలు అందజేస్తామన్నారు. గ్రామ సభలకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
కౌడిపల్లి(నర్సాపూర్): జిల్లాలో పకడ్బందీగా ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల వెరిఫికేషన్ జరుగుతుందని అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. ఆదివారం కౌడిపల్లిలో రేషన్‌కార్డుల సర్వేను తనిఖీ చేసి మాట్లాడారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందేలా అధికారులు పకడ్బందీగా సర్వే చేస్తున్నారని తెలిపారు. ఎక్కడా ఎలాంటి పొరపాట్లు లేకుండా లబ్ధిదారులకు రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందించేందుకు అధికార యంత్రాంగం కృషి చేస్తుందన్నారు. లబ్ధిదారులను గ్రామసభల ద్వారా ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. అనర్హులుంటే తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శులు వెంకటేశం, ప్రవీన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment