జజ్జనకరి జనాలే..
నేడు పెద్దపట్నం, అగ్నిగుండం
బ్రహ్మోత్సవాల్లో భాగంగా పట్నం వారం అనంతరం సోమవారం నగరానికి చెందిన యాదవ భక్తుడి వంశస్తులు పెద్దపట్నం, అగ్నిగుండాలు నిర్వహించడం ఆనవాయితీ. ఇందుకు ఆలయ తోట బావి ప్రాంగణంలో భారీ ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈఓ రామాంజనేయులు మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా ఏర్పాట్లు చేశామన్నారు.
వైభవంగా మల్లన్న పట్నం వారం ● వేలాదిగా తరలివచ్చిన భక్తజనం
కొమురవెల్లి(సిద్దిపేట): ‘మల్లన్న మమ్మేలు.. కోర మీసాల స్వామి దీవించు.. అంటూ భక్త జనం భక్తిపారవశ్యంలో మునిగిపోయింది. మల్లన్న నామస్మరణతో ఆలయ పరిసరాలన్నీ మారుమోగాయి. శివసత్తుల శిగాలు, పోతరాజుల విన్యాసాలతో సందడి నెలకొంది. మహాజాతర ప్రారంభమైంది. ఆదివారం మల్లన్న పట్నం వారం అత్యంత వైభ వంగా నిర్వహించారు. హైదరాబాద్ భక్తులు భారీగా తరలి వచ్చారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు పట్నాలు వేసి, గంగిరేణి చెట్టుకు ముడుపులు కట్టి మొక్కులు చెల్లించారు. స్వామి వారి దర్శనానికి సుమారు 6 గంటల సమయం పట్టింది.
బోనాలతో బారులు
స్వామి వారికి అత్యంత ప్రీతికరమైనది బోనం. వేలాదిగా మహిళలు బోనాలతో బారులు తీరారు. స్వామివారికే కాకుండా గుట్టపై వెలిసిన రేణుక ఎల్లమ్మకు నైవేద్యాలు సమర్పించారు.
దారులన్నీ కొమురవెల్లికే..
మల్లన్న స్వామిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్నాటక, తమిళనాడు, ఒడిశా, మహారాష్ట్రాల నుంచి సైతం జనం రావడంతో దారులన్నీ కిటకిటలాడాయి. ఆలయానికి చేరుకునే రహదారుల్లో 2 కిలోమీటర్ల మేర భక్తులు నిండిపోయారు. పోలీస్ కమిషనర్ అనురాధ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment