ఊపిరి పోద్దాం
సకాలంలో స్పందిద్దాం
● క్షతగాత్రులను తరలించి పారితోషికం అందుకుందాం
● ‘గుడ్ సమారిటన్’తో ప్రయోజనం
సాధారణంగా రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత గంట సమయాన్ని ‘గోల్డెన్ అవర్’ అని అంటారు. ఆ సమయంలో బాధితులకు సరైన వైద్య సహాయం అందిస్తే ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతారు. అయితే ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేసే వారు అరుదుగా ఉంటున్నారు. ఈక్రమంలో కేంద్ర ప్రభుత్వం ఓ అంశాన్ని ప్రజల ముందుకు తెచ్చింది. క్షతగాత్రులను ఆస్పత్రిలో చేర్పించిన వ్యక్తికి రూ. 5 వేల నగదుతో పాటు ప్రశంసపత్రం ఇచ్చి సన్మానించాలని నిర్ణయించింది. ఇందుకోసం ‘గుడ్ సమారిటన్’ పథకాన్ని ప్రవేశపెట్టింది.
జిల్లాలో ప్రమాద ఘటనలు
సంవత్సరం ప్రమాదాలు మృతులు క్షతగాత్రులు
2023 562 323 480
2024 568 302 459
బ్లాక్‌స్పాట్‌లు–33
మెదక్‌జోన్: జిల్లా పరిధిలో పలు రాష్ట్రీయ రోడ్లతో పాటు నాలుగు జాతీయ రహదారులు ఉన్నాయి. అవి 150 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. ఇందులో రామాయంపేట– ఎల్కతుర్తి (765)డీ నేషనల్ హైవే 34 కిలోమీటర్ల పొడవు ఉండగా.. (44) కాళ్లకల్– రామాయంపేట వరకు 51 కిలోమీటర్లు, (161) అల్లాదుర్గం– జమ్మికుంట 30 కిలోమీటర్ల, (161–ఏఏ) నర్సాపూర్– తూప్రాన్ వరకు 35 కిలోమీటర్ల చొప్పున మొత్తం 150 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. అయితే మిగితా జిల్లాలతో పోలిస్తే మెదక్‌లో రోడ్డు ప్రమాదాల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. మద్యం తాగి వాహనాలు నడపడం, వేగ నియంత్రణ లేకపోవడం, అజాగ్రత్త వంటి కారణాలతో నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. పలువురు మృత్యువాత పడుతుండడంతో చాలా మంది క్షతగాత్రులు అవుతున్నారు.
ప్రాణం పోస్తే పారితోషికం
రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారిని ఆస్పత్రుల్లో చేర్పిస్తే సాక్ష్యాలు చెప్పేందుకు గతంలో కోర్టులు, పోలీస్‌స్టేషన్ల చుట్టూ తిప్పేవారు. దీంతో చాలా మంది మనకెందుకొచ్చిన గొడవ అంటూ కళ్ల ముందు ప్రమాదాలు జరిగి చావు బాధితులు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నా పట్టించుకోవడానికి ముందుకురావడం లేదు. దీనికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం గుడ్ సమారిటన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రిలో చేర్పిస్తే రూ. 5 వేల నగదుతో పాటు ప్రశంసపత్రాన్ని అందజేయాలని నిర్ణయించింది. ఏడాదిలో ఒక వ్యక్తి ఆరుగురు క్షతగాత్రులను ఆస్పత్రిలో చేర్పిస్తే ప్రత్యేకంగా మరో రూ. లక్ష నగదును అందజేస్తారు. అలాగే సాక్ష్యం కోసం కోర్టులు, పోలీస్‌స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన అవసరం కూడా లేదు. ఈ పథకం గురించి ప్రజల్లో అవగాహన కరువైంది.
ప్రజలకు అవగాహన కల్పిస్తాం
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గుడ్ సమారిటన్ పథకం గురించి ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దీని గురించి త్వరలో ఆర్‌అండ్‌బీ, ఆర్టీఓ, వైద్య, నేషనల్ హైవే, రెవెన్యూ శాఖల సమన్వయంతో ప్రజలకు అవగాహన కల్పిస్తాం.
– మహేందర్, అదనపు ఎస్పీ, మెదక్
Comments
Please login to add a commentAdd a comment