కొండపోచమ్మసాగర్‌పై నజర్
● బందోబస్తుకు చర్యలు ● హెచ్చరిక బోర్డులు ఏర్పాటు
గజ్వేల్: కొండపోచమ్మసాగర్‌పై పోలీసులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. సాగర్ వద్ద హెచ్చరికల బోర్డులు, రక్షణ చర్యలు చేపట్టారు. మర్కూక్ మండలం కొండపోచమ్మసాగర్ వద్ద ఐదుగురు యు వకులు మృతి చెందిన ఘటన నేపథ్యంలో రక్షణ చర్యల వైఫల్యంపై సోమవారం సాక్షిలో ‘తెరపైకి పోలీస్ అవుట్ పోస్టు’ శీర్షికన ప్రచురితమైంది. ఈ కథనంపై సీపీ అనురాధ స్పందించారు. ఈమేరకు ఈ రిజర్వాయర్ ప్రధాన ద్వారాల వద్ద హెచ్చరిక బోర్డుల ఏర్పాటుకు ఆదేశాలిచ్చారు. అంతేకాకుండా సెలవు దినాల్లో పోలీసులచే బందోస్తు నిర్వహణ, బ్లూకోల్డ్స్ సిబ్బంది తరుచూ పెట్రోలింగ్ నిర్వహణకు చర్యలు చేపట్టాలని పోలీసు ఆధికారులకు సూచించారు. ఈమేరకు గజ్వేల్ రూరల్ సీఐ మహేందర్‌రెడ్డి ప్రాజెక్ట్ సందర్శన వచ్చిన యువలకు జాగ్రత్తలను వివరించారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ సందర్శనలో భాగంగా లోపలికి దిగడానికి, చేపలు పట్టడానికి అనుమతి లేదని సూచించారు. అలాగే జిల్లాలోని మల్లన్నసాగర్, రంగనాయకసాగర్, అనంతగిరి, ఎల్లమ్మచెరువు, కోమటిచెరువు, పాండవుల చెరువుతో ఇతర ప్రధాన జలశయాల వద్ద తరుచూ బందోబస్తు నిర్వహణకు సైతం సీపీ ఆదేశాలిచ్చారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ జలాశయాల వద్దకు ఈత కోసం వెళ్లే పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. ప్రమాదాల జరిగిన తర్వాత బాధపడే బదులు... జరగకుండా చూసుకోవాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment