ప్రతీ పేదకూ సంక్షేమ పథకాలు
రామాయంపేట(మెదక్): ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతీ నిరుపేద కుటుంబానికి వర్తించే విధంగా కృషి చేస్తున్నామని కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. నాలుగు సంక్షేమ పథకాలకు సంబంధించి గురువారం ప్రారంభమైన సర్వే కార్యక్రమాన్ని ఆయన రామాయంపేట మున్సిపాలిటీ, కాట్రియాల గ్రామంలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్వయంగా పలు కుటుంబాలతో మాట్లా డారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, నూతన ఆహార భద్రత కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి జిల్లావ్యాప్తంగా సర్వే ప్రారంభమైందని ఆయన పేర్కొన్నారు. పారదర్శకంగా సర్వేను నిర్వహించి నిరుపేదలను గుర్తించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. రైతు భరోసాకు సంబంధించి సాగులో ఉన్న భూముల వివరాలను రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు నమోదు చేసుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయానికి అనువుగాలేని నాలా భూములు, మైనింగ్, రియల్ ఎస్టేట్ భూములు, ప్రాజెక్టుల నిర్మాణం నిమిత్తం ప్రభుత్వం సేకరించిన భూముల వివరాలు ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా నమోదు చేస్తున్నామని తెలిపారు. గురువారంనుంచి ఈనెల 20 వరకు సర్వే కొనసాగుతుందని, 21 నుంచి 24 వరకు గ్రామాల్లో గ్రామసభలు నిర్వహిస్తామని వెల్లడించారు. మండల ప్రత్యేక అధికారి శ్రీనివాసరావు, తహసీల్దార్ రజనీకుమారి, ఎంపీడీవో సజీలుద్దీన్ పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్ రాజ్
Comments
Please login to add a commentAdd a comment