● ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కోసం.. ● కనీసం 20 రోజులు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి సంబంధించి జిల్లాలో అర్హులైన లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ షురువైంది. 2023–24 ఆర్థిక ఏడాదిలో కనీసం 20 రోజులు ఉపాధి హామీ పనులకు హాజరైన కూలీల కుటుంబాల్లో భూమిలేని వారిని ఈ పథకానికి అర్హులుగా ఎంపిక చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆ సంవత్సరంలో 20 రోజులు ఉపాధి హామీ పనులకు హాజరైన కూలీల కుటుంబాలెన్ని ఉన్నాయనే దానిపై జిల్లా అధికారులు లెక్కలు తీశారు. మొత్తం 94,454 కుటుంబాల (జాబ్‌కార్డులు) 2023–24లో కనీసం 15 రోజులు ఉపాధి హామీ పనులకు హాజరైనట్లు తేల్చారు. ఇందులో 20 రోజులు హాజరైన కూలీల కుటుంబాలు సుమారు 90 వేల వరకు ఉంటాయని అంచనాకు వచ్చారు. ఈ 90 వేల కూలీల కుటుంబాల్లో అసలు వ్యవసాయ భూమిలేని నిరుపేదలెంతమంది అనేది గుర్తించనున్నారు. ఇందుకోసం కూలీల కుటుంబాల ఆధార్ కార్డులతో పూర్తి పరిశీలన చేపడతామని అధికారులు చెబుతున్నారు.
సీఆర్‌డీకి నివేదిక...
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో భూమి లేని నిరుపేదలకు ఏడాదికి రూ.12 వేల ఆర్థిక సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చుట్టిన విషయం విదితమే. ఈ నెల 26 నుంచి ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో 2023–24లో ఉపాధి హామీ కూలీ పనులకు హాజరైన కూలీల కుటుంబాల వివరాలతో జిల్లా అధికారులు నివేదికను సిద్ధం చేశారు. ఈ నివేదికను సీఆర్‌డీకి పంపినట్లు ఉపాధి హామీ పథకం అధికారులు తెలిపారు.
నారాయణఖేడ్‌లో అత్యధికం..
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి సంబంధించిన లబ్ధిదారుల సంఖ్య నారాయణఖేడ్ మండలంలో ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి. 2023–24లో కనీసం 20 రోజులు ఉపాధి హామీ పనులకు వెళ్లిన కూలీలు ఈ మండలంలోనే అధికంగా ఉన్నారు. ఈ ఒక్క మండలంలోనే 7,167 మంది కనీసం 15 రోజులు ఉపాధి హామి పనులకు హాజరైనట్లు లెక్కలు తేల్చారు. ఇందులో 20 రోజులు హాజరైన వారు సుమారు 6,800 మంది వరకు ఉంటారని అంచనాకు వచ్చారు. ఆ తర్వాత స్థానాల్లో వరుసగా హత్నూర, ఝరాసంఘం, మొగుడంపల్లి, కంగ్టి, రాయ్‌కోడ్, పుల్‌కల్, న్యాలకల్, సదాశివపేట, సిర్గాపూర్ మండలాల్లో ఎక్కువ మంది ఉపాధి పనులకు వెళ్లిన కూలీలున్నారు.
Comments
Please login to add a commentAdd a comment