అర్హులందరికీ సంక్షేమ పథకాలు
మెదక్ కలెక్టరేట్/సంగారెడ్డి జోన్: రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతీ ఒక్కరికి అందేవిధంగా చూడాలని, అందుకు తగిన ప్రణాళికలు రూపొందించాలని దేవాదాయశాఖ, ఉమ్మడి మెదక్ జిల్లా మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. బుధవారం మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల కలెక్టర్లు రాహుల్ రాజ్, వల్లూరు క్రాంతి, మిక్కిలినేని మను చౌదరిలతో ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాజ్యాంగం అమలులోకి వచ్చి ఈనెల 26 నాటికి 75 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, నూతన రేషన్ కార్డుల మంజూరు, ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు పథకాలను ప్రతిష్టాత్మకంగా అమలు చేసేందుకు నిర్ణయించిందన్నారు. పథకాల విజయవంతం చేసేందుకు రెవెన్యూ, పంచాయతీరాజ్, వ్యవసాయ శాఖల అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. రైతుల నుంచి వారి భూములకు సంబంధించిన వివరాలను డిక్లరేషన్ తీసుకుంటే భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా వుంటుందని, ఈ దిశగా ఆలోచన చేయాలని మంత్రి సురేఖ కలెక్టర్లకు సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో అత్యంత నిరుపేదలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
‘వన్ రేషన్ – వన్‌స్టేట్’గా రేషన్ కార్డులు
గతంలో అమలు చేసిన మార్గదర్శకాల మేరకే రేషన్ కార్డుల జారీ ప్రక్రియను చేపట్టాలని మంత్రి అధికారులకు సూచించారు. ఒక వ్యక్తికి ఒకే చోట రేషన్ కార్డు వుండేలా చర్యలు తీసుకోవడంతో పాటు ‘వన్ రేషన్ – వన్ స్టేట్’గా రేషన్ కార్డులు జారీ ప్రక్రియను చేపట్టాలని సూచించారు.
పథకాల అమలు నిరంతర ప్రక్రియ
కొత్తగా అమలు చేయనున్న పథకాలకు సంబంధించి ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి తదితర ప్రజా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సురేఖ సమాధానమిచ్చారు. పథకాల అమలు నిరంతర ప్రక్రియని, అర్హులైన ప్రతీ ఒక్కరికి పథకాల ప్రయోజనాలు దక్కుతాయని వారికి స్పష్టం చేశారు. ఈనెల 26 నుంచి నూతన పథకాల అమలులో ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా అత్యుత్తమ పనితీరును కనబర్చాలని మంత్రి కలెక్టర్లకు సూచించారు. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలకు వెనుకాడనని హెచ్చరించారు.
అధికారులంతా సమన్వయంతో పనిచేయాలి : కలెక్టర్
అనంతరం మెదక్ సమీకృత కలెక్టరేట్‌లో జిల్లాలోని అన్నిశాఖల అధికారులతో కలెక్టర్ రాహుల్‌రాజ్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఈనెల 26 నుండి అమలు చేయనున్న 4 పథకాలు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్‌కార్డుల పంపిణీపై అధికారులకు దిశా నిర్దేశం చే శారు. అధికారులంతా సమన్వయంతో పనిచేసి అర్హులైన లబ్దిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా పారదర్శకంగా పనిచేయాలని సూచించారు. ఈనెల26వ తేదిలోగా లబ్దిదారుల ఎంపిక పూర్తి కావాలని ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనలకనుగుణంగా లబ్దిదారుల ఎంపిక ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, డీఆర్డీఓ పీడీ శ్రీనివాసరావు, జిల్లా సరఫరాల అధికారి సురేష్ రెడ్డి, హౌసింగ్ పీడీ మాణిక్యం ఈడీఎం సందీప్‌తోపాటు ఆయాశాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొండా సురేఖ
26లోపు లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలని ఆదేశం
Comments
Please login to add a commentAdd a comment