ఘనపురానికి సింగూరు నీరు
పాపన్నపేట(మెదక్): యాసంగి పంట కోసం సింగూరు నుంచి ఘనపురం ప్రాజెక్టుకు బుధవారం నీటిని విడుదల చేశారు. ఘనపురం ఆయకట్టు పరిధిలోని 21,625 ఎకరాల సాగుకు సుమారు 3 టీఎంసీల నీరు అవసరం. మొదటి విడతగా 0.35 టీఎంసీ నీటిని కలబ్‌గూర్ జెన్‌కో ప్రాజెక్టు నుంచి విడుదల చేశారు. గురువారం వరకు నీరు ఘనపురం ప్రాజెక్టును చేరుతుంది. పశువుల కాపరులు, మత్స్యకారులు మంజీర నదిలోకి వెళ్ళొద్దని అధికారులు సూచించారు.
ఇస్లాంపూర్‌లో ఘనంగా
జాతర ఉత్సవాలు
తూప్రాన్: తూప్రాన్ మండలం ఇస్లాంపూర్ గ్రామ సమీపంలోని రామాలింగేశ్వరస్వామి ఆలయంలో రెండో రోజు బుధవారం జాతర ఉత్సవాలు కొనసాగుతున్నాయి. 14న గణపతి పూజ, అఖండ దీపారాధన, పున్యాహవచనం, రుద్రాభిషేకం, బండ్లు, బోనాలు, 15న స్వామివారికి రుద్రాభిషేకం, దేవతామూర్తులకు అభిషేకం, గోపాల కాల్వలు, ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. స్వామి వారికి ఎడ్లబండ్లతో గుడి చుట్టూ ప్రదర్శన నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు కల్పించారు.
ప్రధాని మోదీకి లేఖలు
సంత్‌సేవాల్ జయంతిని
సెలవు ప్రకటించాలని డిమాండ్
టేక్మాల్(మెదక్): గిరిజనుల ఆరాధ్య దైవమైన సంత్‌సేవాల్ మహరాజ్ జయంతిని పురస్కరించుకొని ఫిబ్రవరి 15న అధికారికంగా సెలవు మంజూరు చేయాలని లంబాడీ ఐక్యవేదిక మెదక్ జిల్లా నాయకులు నెనవత్ చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. బుధవారం టేక్మాల్ మండలం కాద్లూర్‌తాండాలో గిరిజన నాయకులంతా సెలవును కోరుతూ ప్రధాని మోదీకి ఉత్తరాలు రాశారు. మహరాజ్ గిరిజనుల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేశారన్నారు. ఆయన జయంతి సెలవు మంజూరు చేయాలని కోరారు. ఇందులో నాయకులు శ్రీహరి, సురేశ్, దినేశ్, రాకేశ్, రాములు, రతిరాం, అనిల్ పాల్గొన్నారు.
టెండర్ల ఆహ్వానం
పాపన్నపేట(మెదక్) : ఈనెల 17న ఏడుపాయల్లో సీల్డ్ టెండర్లు నిర్వహించనున్నట్లు ఈఓ చంద్రశేఖర్ తెలిపారు. మాఘ అమావాస్య, శివరాత్రి జాతర పురస్కరించుకొని తాత్కాలిక విద్యుత్ దీపాల అలంకరణ, టెంట్లు , సామగ్రి సరఫరా, తాత్కాలిక తడకల పందిళ్లు ఏర్పాటు చేసేందుకు ఆసక్తి గల వ్యక్తులు టెండర్లలో పాల్గొన వచ్చని తెలిపారు. ధరావత్తు సొమ్ము రూ.20 వేలు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.
చాముండేశ్వరిని
సన్నిధిలో ఎస్పీ
చిలప్‌చెడ్(నర్సాపూర్): చిలప్‌చెడ్ మండలం చిట్కుల్ శివారులో మంజీరా తీరాన వెలిసిన చాముండేశ్వరి అమ్మవారిని మంగళవారం తన సతీమణితో కలిసి ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి దర్శించుకున్నారు. సంక్రాంతి పండుగ రోజు ఆలయానికి వచ్చిన వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేకపూజలు, కుంకుమార్చన నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. అర్చకులు ఎస్పీ దంపతులకు తీర్థ, ప్రసాదాలు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment