ప్లాస్టిక్ ముప్పు .. కలిగేనా కనువిప్పు
సంగారెడ్డి: జిల్లాలో ప్లాస్టిక్ కవర్ల వినియోగం విచ్చలవిడిగా పెరిగిపోతోంది. జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో ఏకంగా 71 మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ కవర్లు వాడుతున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నా అధికారులు మాత్రం కళ్లు తెరవడం లేదు. ఓ వైపు ప్లాస్టిక్ వినియోగం పర్యావరణానికి ముప్పు అంటూ ఎంత మొత్తుకుంటున్నా అటు వినియోగదారుల్లో గానీ, ఇటు దుకాణదారుల్లో కానీ పర్యావరణం పట్ల కనీస స్పృహ లేకుండా పోతోంది. నిబంధనలు ఉల్లంఘించి దుకాణదారులు ప్లాస్టిక్ కవర్లను అంటగడుతున్నా అధికారులు మాత్రం తూతూ మంత్రంగా చర్యలు తీసుకుంటున్నారే తప్ప చర్యలు తీసుకోవడం లేదు. దీంతో ప్లాస్టిక్ నిషేధం అమలు కేవలం కాగితాలకే పరిమితమైంది.
ఎక్కడపడితే అక్కడ కవర్లే...
దుకాణదారులు చెత్తను డబ్బాల్లో వేసి మున్సిపాలిటీ వాహనాల్లో వేయాల్సి ఉన్నా ఎవరూ పాటించడంలేదు. దీంతో ఎక్కడపడితే అక్కడ ఈ ప్లాస్టిక్ కవర్లే దర్శనమిస్తున్నాయి. పారిశుద్ధ్య విభాగంలో పనిచేసే సిబ్బంది మామూళ్లు తీసుకుని పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు కూడా ఓవైపు వినిపిస్తున్నాయి. ఎవరైనా స్పందించి ఫిర్యాదులు చేసినప్పుడు అధికారులు నిద్రలేచి నామమాత్రపు తనిఖీలు చేయడం, వారికి జరిమానాలు వేసి చేతులు దులుపుకుంటున్నారు.
వస్త్రపు సంచుల వాడకాన్ని ప్రోత్సహించాలి
రోజు వస్త్రంతో తయారు చేసిన సంచులు వాడేలా ప్రోత్సహించాలని అధికారుల ఆదేశాలు ఎక్కడా అమలు కావడం లేదు. వాటి తయారీపై మహిళా సంఘాల సభ్యులకు శిక్షణ ఇప్పించాలి. ఇందిరా మహిళా శక్తి కింద రుణాలు ఇప్పించి సంచులు తయారు చేయించాలి. వాటిని వ్యాపారులకు విక్ర యించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. మహిళలకు ఆదాయం రావడమే కాకుండా పాలిథీన్ కవర్లు వాడకుండా అడ్డుకట్ట వేసినట్లవుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
మున్సిపాలిటీల వారీగా ప్లాస్టిక్ వాడకం
సంగారెడ్డిలో 22 మెట్రిక్ టన్నులు, జహీరాబాద్ 16, సదాశివపేట 14, అందోల్ – జోగిపేటలో 4 ,నారాయణఖేడ్ 5, బొల్లారం 10 మెట్రిక్ టన్నులు వాడుతున్నట్లు అధికారిక లెక్కలు ఉన్నాయి.
చర్యలు తీసుకుంటాం
పట్టణంలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు తగిన చర్యలు తీసుకుంటాం. ఇకనుంచి తనిఖీలు నిర్వహించి వారికి ఫైన్లు వేస్తాం.
– ప్రసాద్ చౌహన్,
మున్సిపల్ కమిషనర్. సంగారెడ్డి
జిల్లాలో విచ్చలవిడిగా ప్లాస్టిక్ కవర్లవినియోగం
జరిమానాలతో సరిపెడుతున్నఅధికారులు
Comments
Please login to add a commentAdd a comment