భద్రత.. బాధ్యత
మెదక్ మున్సిపాలిటీ: జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రమాదకర మలుపుల వద్ద ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టకపోవడం, వాహనదారుల అతివేగం, మద్యం తాగి, సెల్‌ఫోన్ మాట్లాడుతూ.. హెల్మెట్ ధరించకుండా.. సీటు బెల్టు పెట్టుకోకుండా డ్రైవింగ్ చేయడం, విశ్రాంతి లేకుండా వాహనం నడపడం ఇందుకు కారణం. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా తీసు కోవాల్సిన చర్యలపై ప్రత్యేక కథనం.
33 బ్లాక్ స్పాట్ల గుర్తింపు
జిల్లా మీదుగా 44, 161, 765డీ, 765 డీజీ జాతీయ రహదారులు వెళ్తున్నాయి. అవి 150 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. అయితే మిగితా జిల్లాలతో పోలిస్తే జిల్లా పరిధిలో రోడ్డు ప్రమాదాల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. అధికారిక లెక్కల ప్రకారం గతేడాది 568 రోడ్డు ప్రమాదాలు జరుగగా.. 302 మంది మృత్యువాతపడ్డారు. మరో 459 మంది క్షతగాత్రులయ్యారు. అయితే ప్రధానంగా రోడ్డు ప్రమాదాలు మద్యం మత్తు, ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించడం వల్లే జరుగుతున్నాయని జిల్లా యంత్రాంగం నిర్ధారించింది. ప్రమాదాల నియంత్రణపై తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా జిల్లాలో 33 బ్లాక్ స్పాట్స్‌ను గుర్తించింది. రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా విద్యార్థులతో అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది.
వీటిపై తక్షణ చర్యలు చేపట్టాలి
● జిల్లాలోని రహదారులపై ఎప్పటికప్పుడు గుంతలు పూడ్చివేయాలి.
● రోడ్డు భద్రత నియమాలు కఠినంగా అమలు చేయాలి.
● మలుపుల వద్ద చెట్ల పొదలు తొలగించాలి.
● ప్రమాదకర ప్రాంతాల్లో రేడియంతో కూడిన సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి.
● జాతీయ రహదారులపై వేగ నియంత్రణ పరికరాలు అమర్చాలి.
● ట్రాఫిక్ నియంత్రణపై దృష్టి సారించాలి.
● రహదారుల భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలి.
పటిష్ట చర్యలు చేపడుతున్నాం
జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారకు పటిష్ట చర్యలు చేపడుతున్నాం. 33 బ్లాక్ స్పాట్‌లను గుర్తించి రేడియం స్టిక్కర్లు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేశాం. అలాగే పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో ప్రతిరోజు ప్రధాన కూడళ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నాం. పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టి విద్యార్థులను చైతన్య పరుస్తున్నాం.
– ఉదయ్‌కుమార్‌రెడ్డి, ఎస్పీ
మెదక్ పట్టణంలో రోడ్డు భద్రతపై ర్యాలీ నిర్వహిస్తున్న అధికారులు, విద్యార్థులు
రోడ్డు నిబంధనలు తప్పనిసరి: కలెక్టర్
మెదక్‌జోన్: రోడ్డు భద్రత మనందరి బాధ్యత.. ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా బుధవారం జిల్లా రవాణాశాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. అంతకుముందు ఎస్పీ ఉదయకుమార్‌రెడ్డితో విద్యార్థుల ర్యాలీని ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రాణం చాలా విలువైందని, తల్లిదండ్రులు బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలని విద్యార్థులు చెప్పాలని సూచించారు. ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల్లో మరణించే వారి సంఖ్య ఎక్కువ ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా 20 శాతం మరణాలు తగ్గాయని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా రవాణాశాఖ అధికారి వెంకటస్వామి, ఆర్‌అండ్‌బీ ఈఈ సర్ధార్‌సింగ్, డీఎస్పీ ప్రసన్నకుమార్, ఎంఈఓ నీలకంఠం తదితరులు పాల్గొన్నారు.
చేరుదాం.. సురక్షితంగా..
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు
విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు
31 వరకు రోడ్డు భద్రతా మాసోత్సవాలు
గతేడాది అక్టోబర్ 16న శివ్వంపేట మండలం ఉసిరికపల్లి శివారులో వాగులో కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మొత్తం ఏడుగురు మరణించారు. ఇందులో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు, ముగ్గురు పిల్లలు ఉన్నారు. డ్రైవర్ మద్యం మత్తే ప్రమాదానికి కారణమని పోలీసులు నిర్ధారించారు.
Comments
Please login to add a commentAdd a comment