ప్రయోగశాల.. ఎప్పటికో?
ఆరంభశూరత్వంగా పశు వ్యాధి నిర్ధారణ
ఆరేళ్ల క్రితం నర్సాపూర్‌లో నిర్మించిన జిల్లాస్థాయి పశువ్యాధి నిర్ధారణ ప్రయోగశాల అలంకారప్రాయంగా మిగిలింది. సుమారు రూ. 20 లక్షల వ్యయంతో భవనం నిర్మించి, అవసరమైన యంత్రాలను సమకూర్చిన పాలకులు వినియోగంలోకి తీసుకురావడంలో మాత్రం విఫలమయ్యారు. దీంతో పశువులు అస్వస్థతకు గురైన సమయంలో జబ్బును నిర్ధారించేందుకు అవసరమైన టెస్టుల కోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు.
నర్సాపూర్: కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన అనంతరం నర్సాపూర్‌లో జిల్లాస్థాయి పశువ్యాధి నిర్ధా రణ ప్రయోగశాలను ఏర్పాటు చేయాలని ప్రభు త్వం నిర్ణయించింది. అనుకున్నదే తడువుగా సుమారు రూ. 20 లక్షలు వెచ్చించి నూతన భవనంలో ప్రయోగశాలను ఏర్పాటు చేసింది. రూ. 5 లక్షలతో అవసరమైన యంత్రాలను సైతం సమకూర్చింది. అయితే అందులో పనిచేసే వైద్యులు, ఇతర సిబ్బంది పోస్టులను మాత్రం మంజూరు చేయలేదు. ఇద్దరు పశువైద్యులు, ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లు, ఇద్దరు అటెండర్లు అవసరం కాగా ఆ మేరకు చర్యలు తీసుకోలేదు. దీంతో ప్రయోగశాల నిరుపయోగంగా మారింది. జిల్లాలో గేదెలు 1,22,444 ఉండగా, ఆవులు సుమారు 54 వేలు, మేకలు 1,51,000 ఉన్నాయి. గొర్రెలు 4,30,000 వరకు ఉన్నాయి.
సంగారెడ్డికి పరుగులు
కాగా జిల్లా రైతులకు చెందిన పశువుల జబ్బు నిర్ధారణ పరీక్షల కోసం సంగారెడ్డికి నమూనాలు పంపాల్సి వస్తోంది. పశుసంవర్ధక శాఖ సిబ్బంది అందుబాటులో లేని సమయంలో రైతులే సొంతంగా నమూనాలు తీసుకొని సంగారెడ్డి వెళ్తున్నారు. అక్కడ ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి టెస్టుల కోసం నమూనాలు రావడంతో ఫలితాల కోసం ఎక్కువ సమయం పడుతున్నట్లు తెలిసింది. దీంతో రైతులపై ఆర్థిక భారం పడడంతో పాటు ఫలితాల కోసం నిరీక్షించాల్సి వస్తోంది. జిల్లాస్థాయి ప్రయోగశాల నర్సాపూర్‌లో అందుబాటులో ఉంటే దూరాభారం తగ్గడంతో పాటు టెస్టుల ఫలితాలు వెంటనే అందే అవకాశం ఉంటుంది. కాగా ప్రయోగశాల కోసం నిర్మించిన భవనంలోని ఒక గదిని పశు సంవర్ధకశాఖ అధికారులు వ్యాక్సిన్ నిల్వ కోసం వినియోగిస్తున్నారు. అవసరమైనప్పుడు జిల్లాలోని ఆస్పత్రులకు సరఫరా చేస్తున్నారు.
ప్రయోగశాల ప్రారంభించాలి
పశువుల వ్యాధి నిర్ధారణ ప్రయోగశాల దగ్గరలో ఉంటే మేలు జరుగుతుంది. పాడి గేదెలు జబ్బు చేసినప్పుడు సంగారెడ్డికి వెళ్లాల్సి రావడంతో ఖర్చు, సమయం వృథా అవుతుంది. ఇప్పటికై నా నర్సాపూర్‌లో నిర్మించిన ప్రయోగశాలను ప్రారంభించి రైతులకు మేలు జరిగేలా చూడాలి. – సత్యనారాయణ, పాడి రైతు, శివ్వంపేట
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లా
నర్సాపూర్‌లో ప్రయోగశాల ఏర్పాటు కోసం భవనం, యంత్రాలు అందుబాటులో ఉన్న విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లా. ప్రయోగశాలకు అవసరమైన వైద్యులు, ఇతర సిబ్బందిని కేటాయించి ప్రయోగశాలను ప్రారంభించేందుకు తన వంతుగా కృషి చేస్తా.
– వెంకటయ్య, జిల్లా ఇన్‌చార్జి వెటర్నరీ అధికారి
సిబ్బందిని నియమించడంలో తాత్సారం
ఇబ్బంది పడుతున్న రైతులు
Comments
Please login to add a commentAdd a comment