భగ్గుమన్న విభేదాలు
పటాన్‌చెరు కాంగ్రెస్‌లో ఎమ్మెల్యే గూడెం వర్సెస్ కాటా
పటాన్ చెరు: కాంగ్రెస్‌లో విభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డికి కాంగ్రెస్ అసమ్మతి సెగ తగిలింది. గూడెం కాంగ్రెస్‌లో చేరినప్పట్నుంచీ ఆ పార్టీ కార్యకర్తలు ఆయనపై లోలోపల రగిలిపోతూనే ఉన్నారు. గురువారం పటాన్‌చెరు నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దహనానికి పార్టీ శ్రేణులు ప్రయత్నించడంతో పాటు క్యాంపు కార్యాలయంపై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ప్రశాంత రాజకీయాలకు పెట్టింది పేరైన పటాన్‌చెరు నియోజకవర్గంలో తొలిసారి రాజకీయం రచ్చకెక్కింది. కాంగ్రెస్‌లో చేరినప్పటికీ గూడెం బీఆర్‌ఎస్‌కే అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలతో ఇటీవల బొల్లారంలో ఎమ్మెల్యే పర్యటనను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే గూడెంపై కాంగ్రెస్ పార్టీకే చెందిన కాటా శ్రీనివాస్‌గౌడ్ తన వర్గీయులను రెచ్చగొడుతున్నారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.
ఇప్పటికీ గులాబీ రంగు కుర్చీలే...
ఎమ్మెల్యే తన క్యాంపు కార్యాలయంలో కనీసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫొటో కూడా పెట్టలేదని ఆ కార్యాలయంలో కుర్చీలు ఇంకా గులాబీ రంగులోనే ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. గ్రామాల్లో పట్టణాల్లో కాంగ్రెస్ నేతలకు ఎమ్మెల్యే సరైన గుర్తింపునివ్వడం లేదని బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన వారికే ప్రాధాన్యతనిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే వాస్తవానికి పటాన్‌చెరులో బీఆర్‌ఎస్ కాంగ్రెస్‌లో అధికార ప్రతిపక్షంగా కొనసాగుతోందనేది బహిరంగ రహస్యం.
గూడెం జంప్‌తో ఆశలపై నీళ్లు
గత 15 ఏళ్లుగా కాంగ్రెస్ నాయకులు ప్రతిపక్ష నాయకులుగానే పోరాటం చేస్తూ ఉండిపోయారు. రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రాగానే నామినేట్ పదవులు, ఇతర పదవులపై ఆశలుపెట్టుకున్న కాటా శ్రీనివాస్ వర్గీయులు గూడెం పార్టీలోకి రావడంతో నీరుగారిపోయారు. అయితే అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే కాటా శ్రీనివాస్‌గౌడ్ అధికారుల బదిలీల విషయంలో చక్రం తిప్పారు. దీంతో ఎమ్మెల్యేగా తాను పట్టుకోల్పోతున్నానని గ్రహించిన గూడెం మహిపాల్‌రెడ్డి నేరుగా సీఎం రేవంత్‌రెడ్డి వద్దకు వెళ్లి తన అనుచరగణం సూచించినట్లుగా అధికారులను బదిలీలను చేయించుకున్నారు. దీంతో అధికారంలోకి వచ్చినప్పటికీ తాము ద్వితీయ శ్రేణి కాంగ్రెస్ నేతలుగా మిగిలిపోవాల్సి వస్తోందని కాటా వర్గం అసంతృప్తితో రగిలిపోతోంది. ఎలాగైనా రాష్ట్ర కాంగ్రెస్ దృష్టికి తీసుకువెళ్లాలనే ఉద్దేశంతోనే తాజాగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి చేశారు.
ఒక నియోజకవర్గం.. మూడు గ్రూపులు
ఒకవైపు ఎంపీగా పోటీ చేసిన నీలం మధు ముదిరాజ్ మరోవైపు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, కాటా శ్రీనివాస్‌గౌడ్ వర్గీయులతో పటాన్‌చెరు కాంగ్రెస్ మూడు గ్రూపులుగా విడిపోయింది. గురువారం కొల్లూరులో మాజీ సర్పంచ్ రాజీవ్ నేతృత్వంలో ప్రజాపాలన కార్యక్రమంలో ఎమ్మెల్యేపై నిరసన వ్యక్తం చేశారు. ఇకనుంచి ప్రతీ చోట ఎమ్మెల్యే గూడెంను అడ్డుకోవాలని కాటా వర్గం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీని కాపాడుకునేందుకే ఈ చర్యలు తీసుకోవాల్సి వస్తోందని కాటా వర్గీయులు బహిరంగంగా చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment