పరీక్షల వేళ.. పరేషాన్ వద్దు
ఫోన్ చేయండి..ఒత్తిడిని తగ్గించుకోండి
మెదక్ కలెక్టరేట్: ఇంటర్ వార్షిక పరీక్షలు సమీపిస్తుండడంతో విద్యార్థులు ఒత్తిడికి గురువుతుంటారు. సరిగా రాయలేక పోతామనే భావన వారి ని మరింతగా భయపెడుతుంది. అయితే ఇది విద్యార్థి స్వయంగా సృష్టించుకునే ఒత్తిడి. ఇలాంటి వారికి అండగా నిలవాలని ఇంటర్ బోర్డు టెలీమానస్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. పరీక్షల వేళ విద్యార్థుల ఒత్తిడిని తగ్గించి వా రిలో మనోధైర్యం నింపేలా నిపుణులు సూచనలు అందిస్తున్నారు.
మార్చి 5వ తేదీ నుంచి పరీక్షలు
మార్చి 5వ తేదీ నుంచి 25 వరకు ఇంటర్ వార్షిక పరీక్షలు జరగనున్నాయి. అలాగే ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 22 వరకు ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. ఇంటర్ బోర్డు ఉత్తీర్ణత శాతం పెంచేందుకు ఇప్పటికే 90 రోజుల ప్రత్యేక ప్రణాళికను రూపొందించారు. ప్రతివారం పరీక్షలు నిర్వహించడంతో పాటు చదువులో వెనకబడిన వారిపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. తల్లిదండ్రులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి విద్యార్థుల అభ్యసన పెంపుపై చర్యలు తీసుకుంటుంది.
జిల్లాలో 59 కళాశాలలు
జిల్లాలో మొత్తం 59 జూనియర్ కళాశాలలు ఉండగా, 16 ప్రభుత్వ కళాశాలు, 10 ప్రైవేట్ కళాశాలలు, 33 సెక్టోరియల్ కళాశాలలు ఉన్నాయి. మొదటి సంవత్సరంలో 6,066, ద్వితీయ సంవత్సరంలో 6,418 కలిపి మొత్తం 12,484 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. కాగా అన్ని కళాశాలల్లో విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురికాకుండా ఉండేందుకు మెడిటేషన్ క్లాస్‌లు నిర్వహిస్తున్నారు.
14416 టోల్‌ఫ్రీ నంబర్
టెలీమానస్ 14416 టోల్‌ఫ్రీ నంబర్ గురించి చాలా మందికి అవగాహన లేక సేవలకు దూరంగా ఉంటున్నారు. ఒత్తిడి, క్షణికావేశంలో తప్పుడు నిర్ణయాలు తీసు కొని జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. విద్యార్థుల కోసం ఈ సేవలు 24 గంటల పాటు అందుబాటులో ఉంటాయి. సి బ్బంది ఓపికగా సమస్యలను వింటూ సమాధానాలు ఇస్తారు. ఇంటర్‌తో పాటు భవిష్యత్ లక్ష్యసాధనకు అవలంభించాల్సిన పద్ధతులను వివరిస్తారు. సోషల్ మీడియాకు దూరంగా ఉంటే కలిగే ప్రయోజనాలు, ఆరోగ్యం, జాగ్రత్తలు, చదువు ప్రణాళిక, ఒత్తిడికి గురికాకుండా మార్కుల సాధనకు సలహాలు, సూచనలు ఇస్తారు.
సద్వినియోగం చేసుకోవాలి
పరీక్షల సమయంలో విద్యార్థులు ఎలాంటి మానసిక ఒత్తిడికి గురికావొద్దు. పరీక్ష తప్పుతామని ఆందోళన చెందొద్దు. విద్యాపరంగా ఏమైనా సమస్యలుంటే అధ్యాపకుల ద్వారా పరిష్కరించుకోవాలి. అలాగే టెలీమానస్ సేవల కోసం 14416 టోల్ ఫ్రీ నంబర్‌లో సంప్రదించాలి. అధికారులు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి భయం పోగొడుతారు. – మాధవి, డీఐఈఓ
ఇంటర్ విద్యార్థులకు టెలీమానస్ సేవలు
24 గంటలు అందుబాటులో టోల్ ఫ్రీ
Comments
Please login to add a commentAdd a comment