‘సీతారామరాజు, సీతారాముల కళ్యాణం చూతము రారండి, యువరాజు, లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య, దేవదాసు’ వంటి చిత్రాలతో దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు వైవీఎస్ చౌదరి. తెలుగుదనం ఉట్టిపడేలా విభిన్న కథలతో సినిమాలు రూపొందించిన ఆయన కొంతకాలం బ్రేక్ ఇచ్చారు. తాజాగా ఓ ఫవర్‌ఫుల్ కథాంశంతో ఓ సినిమా చేయబోతున్నానని ఆయన తన పుట్టిన రోజు (మే 23, ఆదివారం) సందర్భంగా చెప్పుకొచ్చారు. దాంతోపాటు సినిమా దర్శకత్వానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను ఆయన పంచుకున్నారు.
‘సినీ పరిశ్రమలో అడుగుపెట్టడమే అదృష్టంగా భావిస్తున్నాను. కెరీర్ పరంగా బాధపడిన సందర్భాలు లేవు. జయాపజయాలతో సంబంధం లేకుండా నా ప్రయాణాన్ని పరిపూర్ణంగా ఆస్వాదిస్తున్నాను’ అంటూ వైవీఎస్ చౌదరి ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇక సుదీర్ఘ విరామం తర్వాత ఓ మంచి ప్రాజెక్ట్‌తో వస్తున్నట్లు ఆయన చెప్పారు. దర్శకుడు అనేవాడు మూసధోరణికి పరిమితమైపోకుండా అన్ని రకాల కథల్ని తీయాలన్నది తన సిద్ధాంతమన్నారు. ఆ ఆలోచనకు అనుగుణంగానే విభిన్న కథాంశాలతో సినిమాల్ని రూపొందిస్తున్నానని వైవీఎస్ తెలిపారు.
ఇక తన తాజా ప్రాజెక్ట్ గురించి చెబుతూ.. తెలుగు సంస్కృతి, సంగీతం, సాహిత్యం కలబోతగా ఓ శక్తివంతమైన కథాంశంతో సినిమా చేయబోతున్నానని, అన్ని హంగులతో కూడిన చక్కటి ప్రేమకథగా ఈ మూవీ ఉండబోతుందన్నారు. ఈ సినిమా ద్వారా కొత్త నటీనటులను వెండితెరకు పరిచయం చేయబోతున్నానని, తెలుగమ్మాయిని హీరోయిన్‌గా తీసుకోవాలనుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ఇక దర్శకుడిగా తాను ఎప్పుడూ కూడా మార్కెట్ లెక్కలు, అంచనాలు, క్యాలికులేషన్స్‌ను దృష్టిలో పెట్టుకొని సినిమాలు చేయనని ఆయన అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment