డాక్టర్ కొడుకు డాక్టర్ కావాలనే ఆశిస్తారు ఇంట్లో పెద్దలు. ఆ దారిలోనే పిల్లల ఆలోచనా ఉంటుంది. కానీ, ఇంట్లో ఏ మాత్రం పరిచయం లేని నటనారంగాన్ని ఎంచుకోవాలనుకున్నాడు రుత్విక్ రెడ్డి. హైదరాబాద్‌లో ఉంటున్న 24 ఏళ్ల రుత్విక్ రెడ్డి చిన్నప్పటి నుంచి యాక్టర్ కావాలని కల కనేవాడు. బెంగళూరులోని జైన్ విశ్వవిద్యాలయం సెంటర్ ఫర్ మేనేజ్‌మెంట్ స్టడీస్ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ గ్రాడ్యుయేట్ చేశాడు. దీంతో తండ్రి హాస్పిటల్ మేనేజ్‌మెంట్ చూసుకుంటాడులే అనుకున్నారు పెద్దలు. కానీ, తను కలగన్న నటనవైపే మొగ్గుచూపాడు. ఆ ఆసక్తితోనే అమెరికాలోని న్యూయార్క్‌లో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన లీ స్టార్ బర్గ్ థియేటర్ అండ్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ తీసుకున్నాడు.
తెలుగు రాష్ట్రాల నుంచి అతి తక్కువ మంది మాత్రమే వెళ్లిన ఆ ఇన్‌స్టిట్యూట్‌లో తన ప్రతిభతో సీటు సంపాదించాడు. ఏడాదిన్నరపాటు శిక్షణ తీసుకొని, తనను తాను నిరూపించుకోవడానికి స్వదేశానికి తిరిగి వచ్చాడు. బాలీవుడ్ మూవీ ప్రాజెక్ట్‌లో లీడ్ రోల్ పోషించడానికి రెడీ అయ్యాడు. ఇండియన్ యాక్టర్, డైరెక్టర్ అరుణ్‌శంకర్ మోహన్‌తో కలిసి ఆల్బమ్ చేస్తున్నాడు. ‘సాక్షి యువర్స్’ రుత్విక్‌రెడ్డిని పలకరించినప్పుడు ఎన్నో విశేషాలను షేర్ చేసుకున్నాడు.
‘‘బాలీవుడ్, టాలీవుడ్ .. ఏ వుడ్ అయినా బ్యాక్‌గ్రౌండ్ లేకపోతే రాణించడం కష్టం. కానీ, నటనపై నాకున్న ఇష్టమే నాకు అవకాశాలు తెచ్చిపెడుతోంది. నటనే ప్రాణంగా ఈ రంగంలో రాణించాలనుకుంటున్నాను’’ అంటూ తన గురించి తాను పరిచయం చేసుకున్నాడు రుత్విక్‌రెడ్డి. ‘‘యాక్టింగ్ అంటే నాకు ఇష్టం అనడం కంటే పిచ్చి అనడం బెటరేమో(నవ్వుతూ). అందరికీ సినిమాలు చూస్తూనో, లేదంటే ఒక వయసు వచ్చాకో నటన అంటే ఇష్టం ఏర్పడుతుంది. కానీ, నాకు 2వ తరగతి నుంచే ఈ పిచ్చి మొదలయ్యింది. నటనతో పాటు నాటకాలు, డ్యాన్స్ అంటే కూడా విపరీతమైన ఇష్టం. పెయింటింగ్ నా మరో హాబీ. కాస్త లీజర్ టైమ్ దొరికితే చాలు క్లాసు రూమ్ అని కూడా చూడకుండా నా ప్రతిభను ప్రదర్శించేవాడిని. నా చుట్టూ ఉన్నవారు తెగ మెచ్చుకునేవారు. అది నాకు బూస్ట్‌లా పనిచేసేది. నాల్గవ తరగతిలో ఉన్నప్పుడు ఒకసారి స్కూల్ ప్రిన్సిపల్ మా నాన్నగారిని పిలిచి ‘డాక్టర్ కొడుకు ఇలా ఆలోచించడం ఏంటి, ఎందుకైనా మంచిది ఒకసారి హెల్త్ చెకప్ చేయించండి’ అన్నారు. ఆ స్థాయిలో ఉండేది అన్నమాట ఇష్టం.
శిక్షణ తప్పనిసరి
గ్రాడ్యుయేషన్ తర్వాత ‘నెక్ట్స్ ఏంటి?’ అన్నప్పుడు ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేవరకు అదే యాక్టింగ్ గురించే నా తపన. సినిమా బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఫ్రెండ్‌ని అడిగాను, బ్లాక్‌బస్టర్స్ ఇచ్చిన డైరెక్టర్‌ని కలిశాను. అప్పుడే, నటనలో భేష్ అనిపించుకోవాలంటే అందుకు తగ్గ శిక్షణ కూడా ఉండాలి అని తెలిసింది. అందుకే, ప్రపంచంలో ఉన్న అన్ని ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌ల గురించి సమాచారం సేకరించేపనిలో పడ్డాను. అప్పుడే, అమెరికాలోని న్యూయార్క్‌లో లీ స్టార్‌బర్గ్ థియేటర్ అండ్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ గురించి తెలిసింది. హాలీవుడ్‌లో క్రిస్ ఎవాన్స్, ఏంజెలీనా జోలీ బాలీవుడ్‌లో రణబీర్ కపూర్.. వంటి మరెందరో ప్రతిభావంతులైన నటులు ఆ ఇన్‌స్టిట్యూట్‌లో పూర్వవిద్యార్థులు. ఇదంతా తెలుసుకున్న తర్వాత అదే నా శిక్షణకు బెస్ట్ ప్లేస్ అనిపించింది. కానీ, అమ్మనాన్నలను ఒప్పించడం మాత్రం అంత ఈజీ కాలేదు. హాస్పిటల్ మేనేజ్‌మెంట్ తీసుకుంటానని ఊహించారు. కానీ, అందులో నా ఇంట్రస్ట్ చాలా చాలా తక్కువ. నా మైండ్‌లో హార్ట్‌లో అంతా నటనే ఉంది. ఇదంతా వివరించాక నాన్న నాకో అవకాశం ఇచ్చారు. దీంతో స్టార్ బర్గ్ వారికి రెగ్యులర్ మెయిల్ చేశాను. కొన్నాళ్ల వరకు వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. చాలా నిరుత్సాహం అనిపించేది. కానీ, వదల్లేదు.
ఆసక్తిని తగ్గించడానికే ప్రయత్నం
మెయిల్స్ ద్వారానే ఇంటర్వ్యూ నడించింది. ఆ తర్వాత వీడియో ఇంటర్వ్యూ. ఎంతసేపూ వాళ్లు నాలో నటన మీదున్న ఆసక్తిని తగ్గించే ప్రయత్నమే చేశారు. కొన్ని రోజుల ప్రయత్నం తర్వాత నాకు సీట్ ఇవ్వడానికి ఓకే అన్నారు. మనమెంత ప్యాషనేట్‌గా ఉన్నప్పటికీ మనల్ని డౌన్ చేయడానికే ఎందుకు చూస్తారంటే మనలో ఎంత ఇంట్రస్ట్ ఉందో తెలుసుకోవడానికే అని తర్వాత తెలిసింది. అలా 2017లో న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో చేరాను.
కలల సౌధంలో ఏడాదిన్నర
ఓ అద్భుత ప్రపంచంలోకి అడుగుపెట్టాననిపించింది ఆ ఇన్‌స్టిట్యూట్‌లో చేరిన మొదటిరోజు. దేశవిదేశాల నుంచి నటనలో శిక్షణ కోసం వచ్చినవారు ఉన్నారు అక్కడ. మా గ్రూప్‌లో 25 మంది. మొదట భయపడ్డాను. హాలీవుడ్ నటీనటులతో క్లాసులు. వారందరితో కలిసిపోవడానికి కొంత సమయం పట్టింది నాకు. మొదట్లో ఒంటరివాణ్ణి అనిపించేది. ఓ రోజు నాకు నేను ఆలోచించుకున్నాను. ‘నా కల నెరవేర్చుకోవడానికి ఇక్కడికి వచ్చాను. ఇలాగే ఉండిపోతే... అనుకున్నంతగా రాణించలేను. ఆత్మవిశ్వాసం పెరగాలి. అందరితో కలిసిపోవాలి’ అనుకున్నాను. తర్వాత నాకు నేనుగా నలుగురితో మాట్లాడటం అలవాటు చేసుకున్నాను. ఫ్రెండ్స్ అయ్యారు. తమిళ యాక్టర్ ధృవ్ (సినిమా హీరో విక్రమ్ కొడుకు) నాకు మంచి ఫ్రెండ్ అయ్యాడు.
మనసును కదిలించారు
నటన కాకుండా నా రెండవ కెరీర్ మార్కెటింగ్‌ను ఎంచుకున్నాను. మా తాతగారు వెంకటరెడ్డి నల్లగొండలో ఉంటారు. నాటకాలు, పాటలు.. కళాత్మకమైన జీవనం తాతగారిది. స్వచ్ఛంద సేవకులు కూడా. అవే బుద్దులు నాకు వచ్చాయి అంటుంటారు నాన్న. ఒకసారి తాతగారితో కలిసి ఎయిడ్స్ సెంటర్‌ని సందర్శించినప్పుడు ఎన్నో విషయాలు తెలిశాయి. అమ్మనాన్న లేని పిల్లలు ఆశ్రయం పొందుతున్నారు. అక్కడ రోజంతా వారితో గడపడం వల్ల ఆ పిల్లలు ఎంత సంతోషం పొందుతారో కళ్లారా చూశాను. అందుకే వీలున్నప్పుడల్లా ఆ ఆశ్రమానికి వెళ్లి, నా వంతు సాయం చేసి వస్తుంటాను’’ అంటూ తెలిపారు రుత్విక్‌రెడ్డి.
నటుడిగా నిరూపణ
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఈ రంగంలో నిరూపించుకోవాలంటే కొంత శ్రమ తప్పదు. ఇప్పుడిప్పుడే నన్ను నేను ప్రూవ్ చేసుకునేలా అవకాశాలు వస్తున్నాయి. బాలీవుడ్‌లో మూవీ ఓకే అయ్యింది. త్వరలోనే ఆ ప్రాజెక్ట్ ప్రారంభం కానుంది. ఇండియన్ యాక్టర్ అండ్ డైరెక్టర్ అరుణ్ శంకర్ మోహన్‌తో కలిసి ఒక ఆల్బమ్‌లో లీడ్ రోల్ చేస్తున్నాను. దీనికి నీతి మోహన్, రికీ కెజ్‌లు వర్క్ చేస్తున్నారు. సద్మా, బాజీరావుమస్తానీ, పద్మావత్, మహానటి సినిమాలంటే చాలా ఇష్టం. నటీనటులు.. రణ్‌వీర్‌సింగ్, దీపికాపదుకొనే, శ్రీదేవి, రణ్‌బిర్ కపూర్, అమితాబ్ బచ్చన్, సావిత్రి నటించిన ఏ మూవీ అయినా మళ్లీ మళ్లీ చూస్తుంటాను. కాస్త లీజర్ టైమ్ దొరికితే చాలు పెయింటింగ్ లేదంటే ఫొటోగ్రఫీ చేస్తుంటాను. బుక్స్ చదవడం, మ్యూజిక్ వినడం, ఎక్సర్‌సైజ్‌లు చేయడం.. మాత్రం మానను.
– రుత్విక్‌రెడ్డి
ఇన్‌స్టాగ్రామ్:ruthvikreddyofficial
– నిర్మలారెడ్డి, సాక్షి పీచర్స్ ప్రతినిధి
ఫొటోలు: ఎస్.ఎస్.ఠాకూర్
Comments
Please login to add a commentAdd a comment