టీవీ నటి ప్రియాల్ మహజన్ తన తండ్రి వయసున్న వ్యక్తితో నటించడమనేది తనకు పెద్ద సమస్య కాదంటు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఆమె కలర్స్‌లో ప్రసారమయ్యే సీరియల్ మోల్కిలో లీడ్‌రోల్ పోషిస్తోంది. ఎక్తాకపూర్ నిర్మిస్తున్న ఈ సీరియల్ మిగతా సీరియల్స్ కంటే అత్యధిక టీఆర్‌పీ రేటింగ్ అందుకుంటు దూసుకుపోతోంది. ఇదిలా ఉండగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియాల్ పలు విషయాలను పంచుకుంది. ఈ నేపథ్యంలో ‘మోల్కి’లో సహా నటుడు అమర్ ఉపాధ్యాయాకు తనకు మధ్య ఉన్న వయసు వ్యత్యాసంపై ప్రశ్న ఎదురవగా.. అది తనను పెద్దగా బాధించడం లేదంటు సమాధానం ఇచ్చింది.
ప్రియాల్ వయసు 19 ఏళ్లు కాగా.. నటుడు అమర్ వయసు 44.. అంటే వీరిద్దరి మధ్య కనీసం 25 ఏళ్ల వ్యత్యాసం ఉంది. ప్రియాల్ మాట్లాడుతూ.. ’వయసు అంతరం నన్ను పెద్దగా బాధించడం లేదు. ఎందుకంటే ప్రతి రోజు నేను అమర్ సర్ నుంచి కొత్త విషయాలను నేర్చుకుంటాను. ఆయన నటించిన ‘క్యుంకీ సాస్ భీ కబీ బాహు థి’, ‘సాత్ నిభానా సాథియా’ సీరియల్లు చూస్తూ పెరిగాను, ఇప్పుడు ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాను. దీనిని గొప్ప అవకాశంగా భావిస్తున్నా’ అంటు చెప్పుకొచ్చింది. అలాగే, ఇద్దరు పిల్లలకు తల్లిగా కనిపించడంపై కూడా స్పందించింది.
‘నేను అమర్ సార్ నుండి నేర్చుకున్నట్లు, వారిద్దరికి (అనుష్క శర్మ మరియు రిత్విక్ గుప్తా) కూడా నేను పలు విషయాలను బోధిస్తుంటాను. వారికి నాకు 10-14 సంవత్సరాల గ్యాప్ ఉంటుంది. వాళ్లు స్కూల్‌కు వెళ్లడం కుదరనప్పుడు సెట్‌కే పుస్తకాలు తీసుకువస్తారు. అప్పడు నేను వారికి చదువులో సాయం చేస్తాను. అంతేకాదు వారితో కలిసి సరదాగా అల్లరి చేస్తుంటాను. ఇది నాకు మంచి అనుభూతిని ఇస్తుంది’ అని ఆమె పేర్కొంది. సీరియల్ విషయానికి వస్తే.. పెదింటికి చెందిన పూర్వీ అనే యువతి పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్న వ్యక్తిని డబ్బు కోసం పెళ్లి చేసుకుంటుంది. కేవలం తన పిల్లలకు తల్లి అవసరమని ఆ యువతిని వివాహం చేసుకున్న ఆ వ్యక్తికి, యువతి మధ్య ఏర్పడే ప్రేమ బంధమే ఈ కథ.
Comments
Please login to add a commentAdd a comment