పట్నా : బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో మంగళవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణను కేంద్ర దర్యాప్తు బృందం ( సీబీఐ)కి అప్పగించాలని బీహార్ ప్రభుత్వం సిఫారసు చేసింది. సుశాంత్ ఆత్మహత్య కేసులో బీహార్, మహారాష్ట్ర పోలీసులు విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. కాగా, దర్యాప్తులో భాగంగా గత ఆదివారం రాత్రి ముంబైకి వెళ్లిన బీహార్ ఐపీఎస్ ఆఫీసర్ వినయ్ తివారీని బలవంతంగా క్వారంటైన్ చేయడం చర్చనీయాంశంగా మారింది. దీంతో సోమవారం బీహార్ అసెంబ్లీలో అన్ని పార్టీల ఎమ్మెల్యేలూ ఈ కేసులో సీబీఐ విచారణ కోసం డిమాండ్ చేశారు.
(చదవండి : సూసైడ్ ముందు సుశాంత్ ఏం సెర్చ్ చేశాడంటే..)
అలాగే సుశాంత్ తండ్రి కేకే సింగ్ కూడా తమ కుమారుడి ఆత్మహత్య కేసును సీబీఐకి అప్పగించాలని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను కోరారు. కుటుంబసభ్యులు కోరిన నేపథ్యంలో సుశాంత్ మృతి కేసులో సీబీఐ విచారణకు సిఫారసు ప్రతిపాదన చేస్తున్నట్లు ఓ మీడియాతో సీఎం నితీశ్ కుమార్ తెలిపారు. కాగా, ముంబైలోని బాంద్రాలోని తన ఇంట్లో సుశాంత్ జూన్ 14వ తేదీన ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. సుశాంత్ మృతి కేసులో ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బీహార్ ప్రభుత్వం సీబీఐ విచారణకు సిఫారసు చేయడం చర్చనీయాంశంగా మారింది.
(చదవండి : రక్షాబంధన్ : సుశాంత్ సోదరి భావోద్వేగం)
Comments
Please login to add a commentAdd a comment