అడవుల్లో పెద్దపులి సంచారం
గిరిజన గ్రామాల్లో ప్రజల ఆందోళన
పులి జాడ గుర్తించని అటవీశాఖ అధికారులు
జంకుతున్న పశువుల కాపరులు
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మండల పరిధిలోని అటవీ ప్రాంతంలో గిరిజన గ్రామాల ప్రజలను పెద్దపులి భయం వేటాడుతోంది. వారం రోజుల నుంచి మండల పరిధిలోని అడవుల్లో పెద్దపులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు పాదముద్రల ద్వారా గుర్తించారు. తొలుత పంబాపూర్, నర్సాపూర్ అటవీ ప్రాంతంలో సంచరించినట్లు గుర్తించిన అధికారులు రెండు రోజుల క్రితం మండలంలోని బఽంధాల, లింగాల అటవీ ప్రాంతంలో సంచరించినట్లు పాదముద్రలను గుర్తించారు. దీంతో అధికారులు పులి జాడ కోసం వెతుకులాడుతున్నారు. బంధాల అడవుల్లో పులి పాదముద్రలను గుర్తించిన అధికారులు ఈ ప్రాంతంలోనే పులి సంచరిస్తుందా.. ఎటువైపు వెళ్లిందనే కోణంలో అన్వేషణ చేస్తున్నారు. సోమవారం రంగాపూర్, బీరెల్లి, గంగారం, లింగాల, బంధాల అటవీ ప్రాంతాల్లో టీంల వారీగా పెద్దపులి జాడ కోసం వెతుకులాడినా పాదముద్రలను లభించలేదని రేంజ్ అధికారి కోట సత్తయ్య తెలిపారు.
అధికారులకు తలనొప్పిగా మారిన పులి
అటవీశాఖ అధికారులకు పెద్దపులి సంచారం తలనొప్పిగా మారింది. కొద్ది రోజులుగా పులి జాడ కోసం అధికారులు టీంల వారీగా ఏర్పడి అటవీ ప్రాంతంలో గాలిస్తున్నారు. మండలంలోనే పులి సంచరిస్తున్నట్లు పాదముద్రలను గుర్తించిన అధికారులు తిరిగి తాడ్వాయి అడవుల నుంచి ఎక్కడకు వెళ్లిందనే విషయాన్ని తెలుసుకునేందుకు అడవుల్లో తిరుగుతున్నారు. రెండు రోజుల క్రితం బంధాల, లింగాల అటవీ ప్రాంతంలో పులి సంచరించినట్లు అడుగుల ద్వారా అధికారులు గుర్తించారు. కానీ ఆ పులి ఎక్కడికి వెళ్లిందనే ఆనవాళ్లు లభించకపోవడంతో తలలు పట్టుకుంటున్నారు. పులిజాడ తెలిసేంత వరకు ఆయా గ్రామాల ప్రజలను భయం వెంటాడుతూనే ఉంటుంది.
గిరిజన గ్రామాల్లో..
అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు పాదముద్రలను గుర్తించడంతో గిరిజన గ్రామాల్లోని ప్రజల్లో భయం నెలకొంది. అటవీ ఉత్పత్తుల సేకరణకు అడవికి వెళ్లేందుకు గిరిజనులు జంకుతున్నారు. అడవి సమీపంలో ఉన్న గ్రామాల ప్రజలు రాత్రి సమయాల్లో గ్రామాల్లోకి పులి వస్తుందని భయపడుతున్నారు. దీంతో పలువురు పశువుల కాపారులు అడవికి వెళ్లడం లేదు. పశువుల యజమానులే ఇంటి దగ్గర వాటిని కట్టేస్తున్నారు. చీకటి పడితే ప్రజలు భయపడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment