‘సాధారణ సెలవుగా ప్రకటించాలి’
ములుగు : గోర్ బంజారాల ఆరాధ్య దైవం సద్గురు సేవాలాల్ మహరాజ్ జయంతి సందర్భంగా ఫిబ్రవరి 15వ తేదీని సాధారణ సెలవుగా ప్రకటించాలని గోర్‌సేనా, గోర్ సిక్వాడి నాయకులు పోరిక రాజ్‌కుమార్, పోరిక రాహుల్ నాయక్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్ ఏఓ అల్లం రాజ్‌కుమార్‌కు వినతి పత్రం అందజేశారు. విన్నపాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో శ్రీరాం నాయక్, బాబు నాయక్, సారయ్య నాయక్, ప్రతాప్ నాయక్, రవివర్మ, జితేందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
108వాహనంలో ప్రసవం
ములుగు రూరల్ : కన్నాయిగూడెం మండలం బట్టాయిగూడెం గ్రామానికి చెందిన కావేరి అనిత సోమవారం ఏటూరునాగారం ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చింది. కాగా పురిటినొప్పులు రాకపోవడంతో పరీక్షించిన వైద్యులు మంగళవారం సాయంత్రం ములుగు ఏరియా ఆస్పత్రికి రెఫర్ చేయడంతో 108 వాహనంలో ములుగు తరలిస్తుండగా పురిటి నొప్పులు రావడంతో మంగళవారం రాత్రి ప్రసవించింది. ఈఎన్‌టీ భూక్య శ్రీధర్, పైలెట్ కరుణాకర్ పురుడు పోశారు. అనిత పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. చికిత్స నిమిత్తం తల్లి, బిడ్డను ములుగు ఆస్పత్రిలో చేర్పించారు. పరీక్షించిన వైద్యులు తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని తెలిపారు. 108 సిబ్బందిని అభినందించారు.
ఉచిత కంటి ఆపరేషన్లు
ములుగు : జంపన్న చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఉచిత కంటి ఆపరేషన్లు చేయించినట్లు ట్రస్టు వ్యవస్థాపక అధ్యక్షుడు భూక్య జంపన్న తెలిపారు. ములుగు నుంచి 36 మందికి ఆపరేషన్లు అవసరమని డాక్టర్లు తెలుపగా వారికి ఉచిత బస్సు, భోజన సదుపాయం కల్పించి హైదరాబాద్‌లో ఆపరేషన్లు చేయించినట్లు చెప్పారు. ఇప్పటి వరకు ట్రస్టు తరఫున తొమ్మిది విడతల్లో 900 మందికి ఆపరేషన్లు పూర్తి చేశామని, ఇది తనకు సంతోషాన్ని ఇస్తుందన్నారు. చలికాలంలో వృద్ధులు ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
అంగన్‌వాడీలకు
ఉద్యోగ భద్రత కల్పించాలి
ములుగు రూరల్: అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని తెలంగాణ రాష్ట్ర రైతుసంఘం జిల్లా కన్వీనర్ ఎండి.అమ్జద్‌పాషా అన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల సమయంలో అంగన్‌వాడీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంగన్‌వాడీ టీచర్లకు, హెల్పర్లకు కనీస వేతనం రూ.18 వేలు ఇవ్వడంతో పాటు ప్రమాద బీమా కల్పించాలని, పెన్షన్ సౌకర్యం కల్పించాలన్నారు. మినీ అంగన్‌వాడీ టీచర్లకు రూ.13,500 వేతనంతో పాటు 9నెలల పెండింగ్ వేతనాలను చెల్లించాలని కోరారు. ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని అమ్జద్‌పాషా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు కృష్ణకుమారి, మీనా కుమారి, సమ్మక్క, పార్వతి, రోజారాణి, అరుణకుమారి, సీత, లక్ష్మీదేవి, సుభాషిని, ఇంజం కొమురయ్య, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
కరాటే పోటీల్లో ప్రతిభ
పలిమెల: మండలంలోని పంకెన కస్తూర్భా గాంధీ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినులు ఇటీవల పరకాలలో జరిగిన నేషనల్ ఓపెన్ కరాటే చాంపియన్ షిప్ పోటీల్లో ప్రతిభ చాటినట్లు స్పెషల్ ఆఫీసర్ మెరుగు భవాని తెలిపారు. ఈ పోటీల్లో గురుకులానికి చెందిన 15 మంది విద్యార్థినులు పాల్గొనగా నలుగురు గోల్డ్ మెడల్, నలుగురు సిల్వర్ మెడల్, ఏడుగురు బ్రాంజ్ మెడల్ సాధించడంతో పాటు ఓవరాల్ చాంపియన్‌షిప్ కూడా సాధించినట్లు తెలిపారు. విద్యార్థినులు, స్పెషల్ ఆఫీసర్ మెరుగు భవాని, కరాటే మాస్టర్ రాజును డీఈఓ రాజేందర్, జీసీడీఓ శైలజ, ఎంఈఓ వెంకటరాజం అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment