కాల్వపల్లి కన్నీరు
● ఎన్‌కౌంటర్‌లో కన్నుమూసిన
మావోయిస్టు అగ్రనేత
● రెండు రాష్ట్రాల్లో ఆయనపై రూ.50 లక్షల రివార్డు
● ఇటీవల దామోదర్ తల్లిని కలిసిన ఎస్పీ శబరీశ్
● లొంగిపోవాలని కొడుకును వేడుకున్న తల్లి
● ఇంతలోనే మృతి చెందినట్లు మావోల ప్రకటన
కాల్వపల్లిలో ముగిసిన మావోయిస్టుల ప్రస్థానం
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మావోయిస్టుల కంచుకోటగా పేరుగాంచిన కాల్వపల్లిలో చివరి ఉద్యమ నాయకుడిగా ఉన్న బడే చొక్కారావు అలియాస్ దామోదర్ మృతి చెందడంతో కాల్వపల్లిలో మావోయిస్టు కుటుంబాల ప్రస్థానం ముగిసినట్టయింది. 1980 దశకం నుంచి ఉద్యమానికి ఊపిరిగా కాల్వపల్లి నిలిచింది. కాగా.. ఏల్‌జీఏ, పీఏల్‌జీఏ, పీపుల్స్‌వార్, మావోయిస్టు పార్టీల్లో కింది స్థాయి నుంచి ఒడిశా, ఛతీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లో డివిజనల్ కమిటీ సభ్యులుగా కొనసాగిన బడే నాగేశ్వర్‌రావు అలియాస్ ప్రభాకర్, బడే మురళి అలియాస్ పున్నంచందర్, సిద్ధబోయిన భరతక్క అలియాస్ సారక్క, సిద్ధబోయిన అశోక్ అలియాస్ శ్రీధర్ గతంలోనే మృతి చెందారు. దీంతో కాల్వపల్లిలో మావోయిస్టుల ప్రస్థానం ముగిసినట్లయ్యింది.
ములుగు/ఎస్‌ఎస్‌తాడ్వాయి:
సీపీఐ(మావోయిస్టు) పార్టీ ఉద్యమ చరిత్రలో బడే దామోదర్ అలియాస్ చొక్కారావుది ఓ మరపురాని అధ్యాయం. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని పూజారి కాంకేర్ నక్సల్స్ క్యాంపుపై గురువారం, శుక్రవారం రెండు రోజులపాటు భద్రతా దళాలు జరిపిన మెరుపు దాడి విషయం తెలిసిందే. ఈఘటనలో జిల్లాలోని ఎస్‌ఎస్ తాడ్వాయి మండలం కాల్వపల్లికి చెందిన మావోయిస్టు కీలకనేత, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి బడే దామోదర్ అలియాస్ చొక్కారావు మృతి చెందినట్లు శనివారం కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్టు) ఒక ప్రకటనలో పేర్కొంది. ఆయన మరణ వార్త సోషల్ మీడియాలో ప్రచారం కావడంతో కాల్వపల్లి ఉలిక్కిపడింది. బంధువులు, గ్రామస్తులు స్నేహితులు ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు.
కాల్వపల్లిలోని మావోయిస్టుల అమరవీరుల స్తూపం
ఇటీవల దామోదర్ తల్లిని కలిసిన ఎస్పీ
డిసెంబర్ 27న ఎస్పీ డాక్టర్ శబరీశ్, ఇన్‌చార్జ్ ఓఎస్డీ, ములుగు డీఎస్పీ రవీందర్.. కాల్వపల్లిలో దామోదర్ తల్లి బతుకమ్మను కలిశారు. దామోదర్ లొంగిపోతే ప్రభుత్వం తరఫున పునరావాసం కల్పించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ‘ఇంటికి రా కొడుకా’ అని బతుకమ్మ కంటనీరు పెట్టుకుంటూ వేడుకుంది. ఇంతలోనే దామోదర్ మృతి చెందినట్లు వార్త విన్న బతుకమ్మ కన్నీరుమున్నీరుగా విలపించింది.
Comments
Please login to add a commentAdd a comment