అంతిమతీర్పు దిశగా ఉద్యమిద్దాం..
ములుగు: ఎస్సీ రిజర్వేషన్‌పై మూడు దశాబ్దాలుగా చేస్తున్న రాజీలేని పోరాటానికి అంతిమతీర్పు దిశగా ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. వర్గీకరణకు ఫిబ్రవరి 7న హైదరాబాద్‌లో నిర్వహించ తలపెట్టిన వెయ్యి గొంతుకలు..లక్ష డప్పులు కార్యక్రమానికి ప్రతిఒక్కరూ డప్పుతో హాజరుకావాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం జిల్లాకేంద్రంలో నిర్వహించిన సన్నాహక సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి డప్పులు కొట్టుకుంటూ డీఎల్‌ఆర్ ఫంక్షన్ హాల్ వరకు సాంస్కృతిక కళా ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎల్‌ఆర్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన సన్నాహక సభ మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మడిపల్లి శ్యాంబాబు అధ్యక్షతన నిర్వహించగా మందకృష్ణ మాట్లాడారు. ఎస్సీ రిజర్వేషన్ ఆలస్యంతో మాదిగలు, ఉప కులాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. రాజ్యాంగ ధర్మాసనం నిర్ణయం మేరకు ఎస్సీ వర్గీకరణ జరుగుతుందని భావిస్తున్న తరుణంలో కొన్ని శక్తులు అడ్డుగా నిలబడుతున్నాయన్నారు. వారి కుట్రలను తిప్పికొట్టేందుకు వెయ్యి గొంతుకలు, లక్ష డప్పుల కార్యక్రమాన్ని చేపడుతున్నట్లుగా తెలిపారు. భావితరాల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని ఎస్సీలు ఉద్యమంలా తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇరుగు పైడి, బుర్రి సతీశ్, గోల్కొండ బుచ్చన్న, రేలా కుమార్, రావుల శంకర్, వావిలాల స్వామి, గజ్జల ప్రసాద్, పుల్లూరి కర్ణాకర్, పేరాల బలరాం, సాంబశివరావు, శ్యాం పాల్గొన్నారు.
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ
Comments
Please login to add a commentAdd a comment