గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు చేయాలి
ములుగు: ఈ నెల 26వ తేదీన జిల్లా వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకునేలా అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ టీఎస్.దివాకర ఆదేశించారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎస్పీ డాక్టర్ శబరీశ్, ఏటూరునాగారం ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా, డీఎఫ్‌ఓ రాహుల్ కిషన్‌జాదవ్, ఆర్డీఓ వెంకటేశ్‌తో కలిసి శనివారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. అన్ని మండలాల్లో ఏర్పాట్లు వైభవంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా జిల్లాకేంద్రంలో ఆయా శాఖల తరఫున స్టాల్స్ ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు, డీపీఓ ఒంటేరు దేవరాజ్, సీపీఓ ప్రకాశ్, డీసీఎస్‌ఓ షా పైజల్ హుస్సేని, జిల్లా విద్యాశాఖ అధికారి పాణిని, ఎస్సీ కార్పోరేషన్ ఈడీ తుల రవి, డీసీఓ సర్ధార్‌సింగ్, డీడబ్ల్యూఓ శిరీష, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ ఆకస్మిక పర్యటన
మంగపేట/ఏటూరునాగారం: మంగపేట, ఏటూరునాగారం మండలాల్లో కలెక్టర్ దివాకర శనివారం ఆకస్మికంగా పర్యటించారు. మంగపేట మండల కేంద్రంలోని మార్కెట్ గోడౌన్‌లోని ఆదివాసీ సమ్మక్క–సారలమ్మ రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ చిల్లీ ప్రాసెసింగ్ యూనిట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా యూనిట్ నిర్వహణ, ఉత్పత్తి సామర్థ్యాన్ని వృత్తి స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి బండారి అఖిల, డైరెక్టర్ కోరం శ్రీలతను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇప్పటి వరకు మొత్తం 174 క్వింటాళ్ల మిర్చిని కొనుగోలు చేసినట్లు తెలిపారు. 1500 కేజీల ఉత్పత్తి ఆయిన కారం ప్యాకెట్లను హైదరాబాద్, వరంగల్ ప్రాంతాలతో పాటు బెంగుళూరు రాష్ట్రానికి మార్కెటింగ్ చేశామని వివరించారు. అనంతరం ఆయన మిర్చి ప్రాసెసింగ్ యూనిట్‌తో పాటు యంత్రాలను పరిశీలించి ప్రాసెసింగ్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణం పనులను పరిశీలించారు. బస్టాండ్‌కు వరద నీరు రాకుండా చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ ఈఈ జగదీశ్‌ను ఆదేశించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం పక్కన ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి పాఠశాల ఆవరణ నుంచి డ్రెయినేజీ కాల్వల ఏర్పాటుకు ఎస్టిమేట్ నివేదికను పంపించాలని ఏఈని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ తోట రవీందర్, ఎంపీడీఓ భద్రు, ఏఓ చేరాలు, డిప్యూటీ తహసీల్దార్ మల్లేశ్వర్‌రావు, ఎంపీఓ మమత, ఆర్‌ఐ శ్రీనివాస్, ఏఈఓ మహేష్, పంచాయతీ కార్యదర్శి సురేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఏటూరునాగారం మండల కేంద్రంలోని సామాజిక ఆస్పత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. సామాజిక ఆస్పత్రిలోని లేబర్ రూమ్, రోగుల చికిత్స గదులు, ఓపీ రిజిస్టర్ పరిశీలించారు. రోగుల వార్డును పర్యవేక్షించి అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. వైద్యులు అందుబాటులో ఉండాలని సూపరింటెండెంట్ సురేష్‌కుమార్‌ను కలెక్టర్ ఆదేశించారు.
కలెక్టర్ టీఎస్.దివాకర
Comments
Please login to add a commentAdd a comment