షట్టర్లు బిగించిన తర్వాతే నీరు వదలాలి
● కలెక్టర్‌ను కలిసి విన్నవించిన ఆయకట్టు రైతులు
గోవిందరావుపేట : మండలంలోని లక్నవరం చెరువు నర్సింహుల కాల్వ –1 కింద ఊర కాల్వ, పుట్ల పంపు కాల్వ, బురదన్ పాయ కాల్వలకు కొత్త షట్టర్లు బిగించాల్సి ఉండగా ఆ పని చేయకుండానే అధికారులు నీరు వదిలారు. దీంతో షట్టర్లు లేకపోవడంతో నీరు వృథాగా పోతోంది. ఫలితంగా పంట చివరి దశలో చెరువులో ఉన్న నీరు సరిపోదనే భయంతో గౌరారం రైతులు శనివారం చల్వాయిలో నీటి పారుదలశాఖ అధికారులను కలిసి షట్లర్లు బిగించిన తర్వాతే నీరు వదలాలని ఘోరవ్ చేశారు. అయినా అధికారులు స్పందించకపోవడంతో సుమారు 50 మంది రైతులు ములుగు కలెక్టరేట్‌కు వెళ్లి కలెక్టర్ దివాకర టీఎస్‌ను కలిసి పరిస్థితిని వివరించారు. సానుకూలంగా స్పందించిన కలెక్టర్.. వెంటనే నీటి పారుదల శాఖ అధికారులతో మాట్లాడి ఈ నెల 22 వ తేదీలోగా నర్సింహుల కాల్వపై నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. దీంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు.
సాగు భూముల వివరాలు
నమోదు చేయాలి
● రైతుభరోసా జిల్లా ప్రత్యేక అధికారి వినయ్ కృష్ణారెడ్డి
వెంకటాపురం(ఎం): మండలంలో సాగవుతున్న, సాగుకు యోగ్యం కాని భూముల వివరాలను అధికారులు ఎప్పటికప్పుడు నమోదు చేయాలని రైతు భరోసా జిల్లా ప్రత్యేక అధికారి వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. మండల పరిధిలోని నర్సాపూర్‌లో చేపట్టిన రైతు భరోసా క్షేత్రస్థాయి కార్యక్రమాన్ని ఆయన శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. రెవెన్యూ, వ్యవసాయ శాఖల అధికారులు భూముల స్థితిని బట్టి రైతులకు ఇబ్బందులు లేకుండా వివరాలు నమోదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ములుగు ఆర్డీఓ వెంకటేశ్, తహసీల్దార్ గిరిబాబు, మండల వ్యవసాయ అధికారి శైలజ, ఏఈఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment