81 మంది గైర్హాజరు
ములుగు: జిల్లాలో నవోదయ ప్రవేశ పరీక్షకు మూడు కేంద్రాలను ఏర్పాటు చేయగా 430 మందికి గాను 349 మంది హాజరు కాగా 81 మంది గైర్హాజరయ్యారు. జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో 153 మందికి 108మంది, బండారుపల్లి మోడల్ స్కూల్‌లో 192 మందికి 168, ఏటూరునాగారం జెడ్పీహెచ్‌ఎస్‌లో 85మందికి 73 మంది హాజరయ్యారు.
21న 3కే రన్
ములుగు: రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా జిల్లాలోని యువతీ యువకులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడానికి ఈ నెల 21న 3కే రన్ నిర్వహించనున్నట్లు ఎస్పీ శబరీశ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 21వ తేదీన తేదీన ఉదయం 6.30గంటలకు జిల్లా కేంద్రంలోని సాధన హైస్కూల్ సమీపంలో గల పాత లారీ ఆఫీస్ నుంచి 3కే రన్ ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి ధనసరి సీతక్క ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు తెలిపారు. 3కే రన్‌లో మొదటి స్థానంలో నిలిచిన వారికి రూ.7వేలు, ద్వితీయస్థానంలో నిలిచిన వారికి రూ.5వేలు, తృతీయ స్థానంలో నిలిచిన వారికి రూ. 3వేలు అందించనున్నట్లు పేర్కొన్నారు.
ఐఎన్‌టీయూసీ డిప్యూటీ జనరల్ సెక్రెటరీగా సమ్మిరెడ్డి
భూపాలపల్లి అర్బన్: కోల్ మైన్ లేబర్ యూనియన్(ఐఎన్‌టీయూసీ) డిప్యూటీ జనరల్ సెక్రెటరీగా ఏరియాకు చెందిన రత్నం సమ్మిరెడ్డి ఎన్నికయ్యారు. ఈ మేరకు రాష్ట్ర కమిటీ నియామకం చేపట్టగా శనివారం యూనియన్ ప్రధాన కార్యదర్శి, మినిమం వేజేస్ అడ్వైజరీ బోర్డు చైర్మన్ జనక్‌ప్రసాద్ నియామక పత్రం అందజేశారు.
సివిల్ సర్వీస్ ఉద్యోగులకు క్రీడాపోటీలు
భూపాలపల్లి అర్బన్: అఖిల భారత సివిల్ సర్వీస్ ఉద్యోగులు ఈ నెల 23, 24 తేదీల్లో హైదరాబాద్‌లో క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా యువజన క్రీడల శాఖ ఇన్‌చార్జ్ అధికారి రఘు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ క్రీడా పోటీల్లో పాల్గొనే సివిల్ సర్వీస్ ఉద్యోగులు ఈ నెల 20వ తేదీలోపు డీవైఎస్‌ఓ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.
కళాజాతా
భూపాలపల్లి అర్బన్: గిరిజన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని గ్రామాలలో వ్యాధుల లక్షణాలు, నివారణ చర్యలపై అవగాహన కల్పించేందుకు వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో కళాజాత ప్రదర్శనలు ప్రారంభించినట్లు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్ తెలిపారు. క్షయ, కుష్ఠు నివారణ, మాతా శిశు సంరక్షణ, వ్యాధి నిరోధక టీకాలు, క్రిమి కీటకాల ద్వారా సంక్రమించే వ్యాధులు, రక్తహీనత, హెచ్‌ఐవీ, ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవాలు, వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలు పట్ల కళాజాత ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో అంబట్‌పల్లి, ఆజాంనగర్, మహాముత్తారం పీహెచ్‌సీల పరిధిలోని 30 గ్రామపంచాయతీలలో కళాజాత కార్యక్రమాలు ఈ నెల 30వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
త్వరితగతిన పనులు పూర్తిచేయాలి
పలిమెల: మండలంలోని పలు అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తిచేయాలని అదనపు కలెక్టర్ ఎల్.విజయలక్ష్మి అన్నారు. ఈ సందర్భంగా శనివారం మండల కేంద్రంలోని ఇంటిగ్రేటెడ్ భవన స్థలం, పీహెచ్‌సీ భవనం, జీపీ, అంగన్‌వాడీ భవన నిర్మాణ పనులను ఆమె పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ నూతన భవనాలను త్వరితగతిన పూర్తిచేయించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. సర్వాయిపేట గ్రామాన్ని సందర్శించి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను అర్హులైన వారికి అందేలా చూడాలని అన్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల వెరిఫికేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఈఈ వెంకటేశ్వర్లు, డీఈ సాయిలు, ఏఈ రవీందర్, ఎంపీఓ ప్రకాశ్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment