మినీ జాతరకు ఏర్పాట్లు పూర్తి
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారంలో ఈనెల 12నుంచి 15వ తేదీ వరకు జరగనున్న మినీ మేడారం జాతరకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ టీఎస్. దివాకర తెలిపారు. మండల పరిధిలోని మేడారంలో ఆయా శాఖల అధికారులతో కలిసి కలెక్టర్ దివాకర క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించారు. మేడారంలోని వైద్య శిబిరం, జంపన్నవాగు వద్ద స్నాన ఘట్టాలను, మహిళలు దుస్తులు మార్చుకోవడానికి ఏర్పాటు చేసిన గదులను పరిశీలించారు. అనంతరం గద్దెల ప్రాంతంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతరకు 10 నుంచి 20 లక్షల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉండడంతో దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. నాలుగు రోజులపాటు జరిగే జాతతరకు నిరంతరం విద్యుత్ సరఫరా చేయడంతో పాటు వైద్య సిబ్బంది 24గంటల పాటు అందుబాటులో ఉంటారని తెలిపారు. వైద్య శాఖ సిబ్బంది అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. అత్యవసర సమయంలో ఇబ్బందులకు గురయ్యే వారిని జిల్లా కేంద్రానికి తరలించడానికి వాహనాలు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. గద్దెల ప్రాంతంలో క్యూలైన్ల వద్ద తొక్కిసలాట, చోరీలు జరగకుండా పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. జంపన్నవాగు, గద్దెల ప్రాంతం, మేడారం పరిసర ప్రాంతాలలో పారిశుద్ధ్య కార్మికులతో నిరంతరం శుభ్రం చేయించాలని డీపీఓ దేవరాజ్‌ను ఆదేశించారు. భారీ సంఖ్యలో భక్తుల వాహనాలు వస్తే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాల్లో నిలిపే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పోలీస్ శాఖ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రస్తుతం ఎండలు మండిపోండడంతో అమ్మవార్ల గద్దెల ప్రాంగణంలో చలువ పందిళ్లు, మ్యాట్లను ఏర్పాటు చేయాలని దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు. సుమారుగా రూ.5.30 కోట్ల రూపాయలతో వివిధ పనులను పూర్తి చేసినట్లు వివరించారు. పలుచోట్ల ప్రత్యేకంగా మరుగుదొడ్ల ఏర్పాటుతో పాటు తాగునీటి వసతి సౌకర్యం కల్పించామని తెలిపారు. ఆర్టీసీ అధికారులు హనుమకొండ నుంచి నిరంతరం బస్సులను మేడారం జాతరకు నడిపించనున్నారని తెలిపారు. జాతరకు వచ్చే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం వర్తిస్తుందని వివరించారు. అమ్మవార్లను దర్శించుకోవడానికి వచ్చే భక్తులు మొక్కులను చెల్లించుకొని తిరుగు ప్రయాణం కావాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రవీందర్, డీపీఓ దేవరాజ్, డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు, ఇరిగేషన్ ఈఈ నారాయణ తదితరులు పాల్గొన్నారు.
జాతరలో భక్తులకు సౌకర్యాలు
కలెక్టర్ టీఎస్.దివాకర
Comments
Please login to add a commentAdd a comment