జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు
నాగర్‌కర్నూల్: నూతన సంవత్సరంలో జిల్లా ప్రజలు అన్నిరంగాల్లో రాణించి సుఖసంతోషాలతో విలసిల్లాలని కలెక్టర్ బదావత్ సంతోష్ ఆకాంక్షించారు. మంగళవారం ఆయన చాంబర్‌లో మాట్లాడుతూ ఆంగ్ల నూతన సంవత్సరం–2025లో ప్రజలు కొత్త ఆలోచనలు, సరికొత్త నిర్ణయాలు, ఆశలు, ఆశయాలతో ముందుకెళ్లాలని కోరారు. కొత్త సంవత్సరం జిల్లా ప్రజలు అందరికీ సంతోషం ఇవ్వాలని, అందరి కలలు నెరవేరాలని, ప్రతిరోజును ఆస్వాదిస్తూ ఉండాలని అభిలాషించారు. గతేడాది కంటే ఈసారి మరిన్ని ఉన్నత ఆశయాలను ఏర్పరచుకొని వాటిని సాధించే దిశగా ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రతిఒక్కరూ కొత్త సంవత్సర వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
హాస్టల్ వార్డెన్ సస్పెండ్
నాగర్‌కర్నూల్: జిల్లాకేంద్రంలోని ఎస్సీ–ఎ హాస్టల్ వార్డెన్ శ్రీనివాసులును సస్పెండ్ చేస్తూ కలెక్టర్ బదావత్ సంతోష్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. హాస్టల్ పరిసరాల్లో మద్యం తాగి.. విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని గత నెలలో పలు విద్యార్థి సంఘాలు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో విచారణకు ఆదేశించారు. దాదాపు నెల రోజులపాటు ఉన్నతాధికారులు విద్యార్థులను విచారించి రిపోర్ట్‌ను కలెక్టర్‌కు అందజేశారు. అధికారులు ఇచ్చిన విచారణ అంశాల ఆధారంగా వార్డెన్ శ్రీనివాసులును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
నాగర్‌కర్నూల్: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంతోపాటు అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని అదనపు కలెక్టర్ సీతారామారావు అన్నారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని మహాత్మా జ్యోతిబాపూలే సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. గురుకుల పాఠశాలలో వంట గది, వండిన అన్నం, కూరగాయలు, నిల్వ ఉన్న బియ్యం, ఇతర వంట సామగ్రిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురుకులాల్లో 40 శాతం డైట్ చార్జీలు పెంచినందున పౌష్టికాహారంతో కూడిన నాణ్యమైన భోజనం అందించాలన్నారు. అనంతరం తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. విద్యార్థులు బాగా చదువుకొని జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఆయన వెంట డీఈఓ రమేష్‌కుమార్, జిల్లా పౌరసరఫరాల అధికారి శ్రీనివాస్, గురుకుల పాఠశాలల అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment