ఉద్యోగ నియామకాల్లో ఏజెన్సీల ఇష్టారాజ్యం
అక్రమ వసూళ్లతో దందా
నెలల తరబడి పీఎఫ్, ఈఎస్‌ఐ చెల్లించని వైనం
సకాలంలో జీతాలు అందక ఉద్యోగుల ఇబ్బందులు
అధికారుల పర్యవేక్షణ కరువు
‘జిల్లాలో ఔట్‌సోర్సింగ్ నియామకాలకు సంబంధించిన ఓ ఏజెన్సీ తమ పరిధిలోని ఉద్యోగులకు కొన్ని నెలలుగా పీఎఫ్, ఈఎస్‌ఐ చెల్లించడం లేదు. ఫలితంగా ప్రభుత్వం నుంచి అందాల్సిన బకాయిలు, జీతాలు సక్రమంగా అందడం లేదు. ఈ మేరకు కలెక్టర్‌కు ఫిర్యాదులు అందడంతో సదరు ఏజెన్సీని నియామకాల ప్రక్రియ నుంచి తప్పించారు. జిల్లాలో ఇలాంటి ఏజెన్సీల ఆగడాలు శృతిమించుతున్నాయన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.’ – సాక్షి, నాగర్‌కర్నూల్
జిల్లాలోని ప్రభుత్వ శాఖల్లో ఔట్‌సోర్సింగ్ కింద ఉద్యోగుల నియామకంలో కీలకంగా వ్యవహరించే ఏజెన్సీల్లో కొన్ని అక్రమాలకు పాల్పడుతున్నాయన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సక్రమంగా ఈపీఎఫ్, ఈఎస్‌ఐ చెల్లించకుండా ఏజెన్సీల నిర్వాహకులు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఔట్‌సోర్సింగ్ నియామకాలకు నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉండగా.. కొన్నిసార్లు నోటిఫికేషన్ ఇవ్వకుండానే తమ ఇష్టానుసారంగా నియామకాలు చేపడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
ఉద్యోగుల జీతంలోనూ కోత..
జిల్లాలో మొత్తం 26 లైసెన్స్‌డ్ ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలు ఉన్నాయి. వీటిలో సుమారు 15 వరకు ఏజెన్సీలకు ప్రభుత్వం ఔట్‌సోర్సింగ్ నియామక ప్రక్రియ బాధ్యతలను అప్పగించింది. ప్రధానంగా అటవీ, ఆరోగ్యశాఖ, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ తదితర శాఖల్లో సుమారు 550 వరకు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. వీరందరికీ ఆయా ఏజెన్సీలు నిబంధనల ప్రకారం ఈపీఎఫ్, ఈఎస్‌ఐ చెల్లింపులు చేయడం లేదు. అలాగే ఉద్యోగుల జీతంలోనూ కోత పెడుతూ.. అందినకాడికి దండుకుంటున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి.
కొరవడిన సమన్వయం..
ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలు సక్రమంగా పనిచేసేలా పర్యవేక్షించాల్సిన అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల ఈపీఎఫ్, ఈఎస్‌ఐ చెల్లింపులను కార్మిక శాఖ పర్యవేక్షించాల్సి ఉంటుంది. అలాగే వీరికి జీతభత్యాల చెల్లింపులను ఆయా శాఖల విభాగాధిపతులు, డీడీఓలు తనిఖీ చేసి, మంజూరు చేయాల్సి ఉంది. ఏజెన్సీల గుర్తింపు, నియామకాల ప్రక్రియ, ఏజెన్సీలకు కేటాయింపు తదితర బాధ్యతలను ఎంప్లాయింట్ అధికారులు నిర్వర్తిస్తారు. అయితే ఏజెన్సీల నిర్వహణలో ఆయా శాఖల మధ్య సమన్వయలోపం కన్పిస్తోంది. బాధితులు తమ సమస్యల కోసం ఆయా శాఖల అధికారులకు నివేదిస్తే.. తమ పరిధి కాదంటూ తప్పించుకుంటున్నారు. జిల్లాలోని ఔట్‌సోర్సింగ్ నియామకాల ప్రక్రియ, ఏజెన్సీలపై ఉన్నతాధికారులు దృష్టిసారించాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అధికారులతో కుమ్మకై వసూళ్లు..
నిరుద్యోగుల ఆశలను అవకాశంగా చేసుకొని కొన్ని ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలు అక్రమ దందాలకు పాల్పడుతున్నాయి. పలు ప్రభుత్వ శాఖల్లో ఏర్పడిన ఖాళీల్లో ప్రభుత్వం నేరుగా నియామకాలు చేపట్టకుండా, ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీల తరఫున తాత్కాలిక ప్రతిపాదికన ఉద్యోగులను నియమించుకుంటోంది. అయితే ఇదే అదనుగా కొన్ని ఏజెన్సీలు ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఒక్కో శాఖను బట్టి నిరుద్యోగి నుంచి రూ. 20వేల నుంచి రూ. లక్ష వరకు వసూలు చేస్తూ దందాను సాగిస్తున్నాయి. వీటిలో సంబంధిత శాఖల అధికారులను సైతం ఏజెన్సీల నిర్వాహకులు ‘మేనేజ్’ చేసుకుంటున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
●నిబంధనల ప్రకారం చేస్తున్నాం..
జిల్లాలో నిబంధనల మేరకు ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలకు నియామక ప్రక్రియను అప్పగించాం. పీఎఫ్, ఈఎస్‌ఐ చెల్లింపు విషయంలో ఆయా శాఖల డీడీఓలదే బాధ్యత. నిబంధనలు పాటించి ఏజెన్సీలపై ఉన్నతాధికారులకు నివేదించి చర్యలు తీసుకుంటాం.
– రాఘవేందర్,జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి
Comments
Please login to add a commentAdd a comment