స్థానిక సమరానికి సన్నద్ధం
ప్రత్యేకంగా 12 మంది నోడల్ అధికారుల నియామకం
నిఘా నీడలో..
ఎన్నికలకు అవసరమైన సామగ్రి కొద్ది రోజులుగా జిల్లాకు చేరుతోంది. వీటిని స్థానిక గోదాంలలో భద్రపరుస్తున్నారు. ఇతరులెవరూ లోపలికి వెళ్లకుండా సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ కొనసాగుతోంది. ఒక్కో వార్డుకు ఒక బ్యాలెట్ పెట్టేను వినియోగించనున్నారు. జిల్లాలో పంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో నిర్వహించనుండటంతో ఒకచోట వినియోగించిన బ్యాలెట్ బాక్స్‌లను మరోచోట వాడుకునే వీలుంది. స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు నిమగ్నం అవుతుండగా.. పల్లెల్లోనూ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది.
ఈ అంశాలపై దృష్టి..
జిల్లాలో ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లు, పర్యవేక్షణ చేయడానికి మొత్తం 12 విభాగాలకు నోడల్ అధికారులను నియమించారు. వీరు ఎన్నికల ప్రవర్తనా నియమావళి, మానవ వనరుల నిర్వహణకు రమేష్‌కుమార్ (డీఈఓ), బ్యాలెట్ బాక్సుల నిర్వహణ శ్రీనివాస్‌రెడ్డి (అడిషనల్ విద్యాశాఖ), రవాణ నిర్వహణ చిన్నబాలు (డీటీఓ), శిక్షణ కార్యక్రమాలు గోపాల్ (సీఈఓ), ఎన్నికల సామగ్రి నిర్వహణకు రఘనందర్‌రావు (డీసీఓ), ఖర్చు మహ్మద్‌భాషా (అకౌంట్ ఆఫీసర్), పర్యవేక్షణ సంతోష్‌రావు (డీఏఓ), పరిశీలకులు అరుణరెడ్డి (ఎస్‌డీసీ), బ్యాలెట్ పేపర్ల బాధ్యత రాజేశ్వరి (సంక్షేమాధికారి), మీడియా కమ్యూనికేషన్ కిరణ్‌కుమార్ (డీపీఆర్‌ఓ), హెల్ప్‌లైన్, ఫిర్యాదుల విభాగం యాదగిరి (ఎస్‌డీసీ), రిపోర్టులు, రిటర్నింగ్ చంద్రశేఖర్ (డీఏఓ)లను నోడల్ అధికారులుగా నియమించారు. అధికారులు ఒకవైపు ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తుండటంతో గ్రామాల్లో పోటీ చేసే అభ్యర్థులు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అచ్చంపేట: పంచాయతీ ఎన్నికల తేదీ ఎప్పుడు ప్రకటించినా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఇప్పటికే జిల్లాకు చేరిన ఎన్నికల సామగ్రిని భద్రపరించారు. బ్యాలెట్ పెట్టేల మరమ్మతు పూర్తిచేసి సిద్ధంగా ఉంచారు. బ్యాలెట్ పేపర్ల ముద్రణకు ఇప్పటికే టెండర్లు ఆహ్వానించారు. ఎన్నికల సిబ్బంది శిక్షణకు సంబంధించి మాడ్యూల్స్, ప్రిసైడింగ్, రిటర్నింగ్ అధికారుల గైడ్‌లైన్స్ పుస్తకాలు జిల్లాకు చేరాయి. ఇప్పటికే పోలింగ్ కేంద్రాల తుది జాబితాను ప్రకటించారు. వార్డులు, గ్రామాల వారీగా సిద్ధం చేసిన ఓటరు జాబితాను ఈ నెల 6న రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేశారు. 12 అంశాలకు సంబంధించి నోడల్ అధికారులకు బాధ్యతలు అప్పగించారు. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయితే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది.
ఓటర్లు వీరే..
జిల్లాలో 464 గ్రామ పంచాయతీలు, 4,140 వార్డుల వారీగా ఓటరు జాబితాను సిద్ధం చేశారు. మొత్తం 6,59,338 మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం అధికారులకు శిక్షణ కూడా ఇచ్చారు. జిల్లావ్యాప్తంగా 4,140 పోలింగ్ కేంద్రాలను సైతం సిద్ధం చేశారు. బ్యాలెట్ పేపర్లు ముద్రించేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా అధికార యంత్రాంగం సామగ్రిని సమకూరుస్తున్నారు. బ్యాలెట్ బాక్స్‌లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఓటరు జాబితాను ప్రభుత్వం ఆమోదించడంతో పోటీ చేసేందుకు పలువురు ఆసక్తి చూపుతున్నారు. కులాల వారీగా తమకు అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో పట్టు సాధించేందుకు ఇప్పటికే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. రిజర్వేషన్ల ప్రకటన పూర్తయితే పోటీలో ఉండేవారు ఓటర్లను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నారు.
ఇప్పటికే జిల్లాకు చేరిన ఎన్నికల సామగ్రి
ఓటరు జాబితా విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషన్
రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తికావడమే తరువాయి..
గ్రామాల్లో వేడెక్కుతున్న రాజకీయ వాతావరణం
Comments
Please login to add a commentAdd a comment