ఎల్‌ఆర్‌ఎస్‌పై అనాసక్తి! | - | Sakshi
Sakshi News home page

ఎల్‌ఆర్‌ఎస్‌పై అనాసక్తి!

Published Thu, Oct 31 2024 2:16 AM | Last Updated on Thu, Oct 31 2024 2:16 AM

ఎల్‌ఆ

ఎల్‌ఆర్‌ఎస్‌పై అనాసక్తి!

నల్లగొండ టూటౌన్‌: జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఎల్‌ఆర్‌ఎస్‌ (లేఅవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీం) దరఖాస్తుల పరిశీలనలో అధికారులకు దరఖాస్తుదారులు సహకరించడం లేదు. అధికారులు దరఖాస్తుల పరిశీలనకు క్షేత్రస్థాయి పర్యటనకు వచ్చినా లేఅవుట్ల క్రమబద్ధీకరణకు దరఖాస్తుదారులు మాత్రం రాకుండా మొహం చాటేస్తున్నట్లు సమాచారం. మున్సిపాలిటీల పరిధిలో ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలను ఆక్రమించి ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నట్లు ఆరోపణలు ఉండడంతో కొందరు క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చేందుకు ఆసక్తిచూడం లేదని తెలుస్తోంది. దీంతో మున్సిపాలిటీల్లో ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ నత్తనడకన సాగుతోంది.

నాలుగేళ్ల క్రితం దరఖాస్తులు..

జిల్లాలోని మున్సిపాలిటీల్లో అనుమతి లేని వెంచర్లలో కొనుగోలు చేసిన స్థలాలను క్రమబద్ధీకరించుకునేందుకు నాలుగేళ్ల క్రితం అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌ను తెచ్చింది. రూ.వెయ్యి చెల్లించి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో అన్ని మున్సిపాలిటీల్లో లక్షలోపు దరఖాస్తులొచ్చాయి. ఒక్క నీలగిరి మున్సిపాలిటీలో 40వేలు రాగా కొన్ని పరిశీలించగా ఇంకా దరఖాస్తులు 20 వేలు పెండింగ్‌లో ఉన్నాయి. ఇటీవల ప్రిన్సిపల్‌ సెక్రటరీ వీడియో కాన్పరెన్స్‌ ద్వారా ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల క్రమబద్ధీకరణపై మున్సిపల్‌ అధికారులతో సమీక్షించారు. ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని మున్సిపల్‌ అధికారులను ఆదేశించింది. దీంతో మున్సిపాలిటీల యంత్రాంగం దరఖాస్తులతోపాటు క్షేత్ర స్థాయికి వెళ్లి ప్లాట్లను పరిశీలించేందుకు వెళ్తున్నారు. సంబంధిత ఉద్యోగులు దరఖాస్తులు చేసుకున్న వారికి ఫోన్‌లు చేసి స్థలాలను క్రమబద్ధీకరణ చేసుకోవాలని చెబుతున్నా దరఖాస్తుదారులు స్పందించడం లేదు. వంద మందికి ఫోన్‌ చేస్తే అందులో పది మంది మాత్రమే ఫీజులు చెల్లించి ముందుకు వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

దొరకని స్థలాలు.. ఇబ్బందుల్లో ఉద్యోగులు

ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుదారుల అర్జీల ప్రకారం వారి సర్వే నంబర్‌ ఆధారంగా క్షేత్ర స్థాయికి వెళ్లినప్పటికి అక్కడ కనీసం హద్దురాళ్లు కూడా లేకపోవడంతో గుర్తించడానికి ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగులు ఫోన్‌ చేసినా వారు స్పందించకపోవడం.. ప్లాట్ల వద్దకు రాకపోవడంతో ఈ పరిస్థితి ఎదువుతుంది. ఇంకా.. కొనుగోలు చేసినప్పటికి డాక్యుమెంట్‌పై ఉన్న ధరలు 14 శాతం ఫీజు చెల్లించి క్రమబద్ధీకరణ చేసుకోవాల్సి ఉండగా ఎక్కువ మంది ఆసక్తి చూపడంలేదు. దీంతో దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ వేగంగా సాగడం లేదు.

గ్రీన్‌ బెల్ట్‌ దరఖాస్తుల తిరస్కరణ

ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రక్రియలో భాగంగా గత సంవత్సర కాలంగా 15 వేలకు పైగా దరఖాస్తుదారులు అనుమతులు తీసుకున్నారు. కాగా ఎఫ్‌టీఎల్‌, గ్రీన్‌బెల్డు, ఇండస్ట్రీస్‌ తదితర ప్రాంతాల్లో కొనుగోలు చేసిన వారు కూడా ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. పట్టణంలో దాదాపు 10 ప్రాంతాల్లో ఈ సమస్య ఉంది. ఆయా ప్రాంతాల్లో దరఖాస్తులు చేసుకున్న వారివి తిరస్కరిస్తూ పెండింగ్‌లో పెట్టారు.

ఫ ఉద్యోగులు ఫోన్‌ చేసినా

స్పందించని దరఖాస్తుదారులు

ఫ క్షేత్ర స్థాయి పరిశీలనలో

తప్పని ఇక్కట్లు

ఫ ఒక్క నీలగిరిలోనే 20 వేల అర్జీలు పెండింగ్‌

ఫ మిగతా చోట్ల 60వేలకు పైగానే..

దరఖాస్తుదారులు సహకరించాలి

ప్రభుత్వ ఆదేశానుసారం ఎల్‌ఆర్‌ఎస్‌ కింద వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తున్నాం. మున్సిపల్‌ వార్డు ఆఫీసర్లు దరఖాస్తుదారులకు ఫోన్‌ చేసినప్పుడు సహకరించి లోకేషన్లు పంపించాలి. నవంబర్‌ నెలాఖరులోగా ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రక్రియ పూర్తిచేస్తాం.

– సయ్యద్‌ ముసాబ్‌ అహ్మద్‌,

మున్సిపల్‌ కమిషనర్‌, నల్లగొండ

No comments yet. Be the first to comment!
Add a comment
ఎల్‌ఆర్‌ఎస్‌పై అనాసక్తి!1
1/1

ఎల్‌ఆర్‌ఎస్‌పై అనాసక్తి!

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement