అంత్యక్రియలకు వెళ్లొస్తూ అనంతలోకాలకు
కోదాడరూరల్: బంధువుల అంత్యక్రియలకు హాజరై తిరిగి వెళ్తున్న క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందింది. ఈ సంఘటన కోదాడ మండల పరిధిలోని తొగర్రాయి శివారులో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. మోతె మండలం నర్సింహాపురం గ్రామానికి చెందిన పోగూరి రమేష్, విజయలక్ష్మి (38) దంపతులు. విజయలక్ష్మి తన తల్లిగారి గ్రామమైన తొగర్రాయిలో బాబాయి కుమారుడు మృతిచెందడంతో అంత్యక్రియలకు బైక్‌పై వెళ్లారు. గ్రామశివారుకు వెళ్లిన తర్వాత మేళ్లచెర్వు నుంచి కోదాడ వైపు వస్తున్న లారీ ట్యాంకర్ వీరి బైక్‌ను వెనుక నుంచి ఢీ కొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన విజయలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందగా భర్తకు స్వల్పగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని కోదాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతురాలి భర్త రమేష్ యాదగిరిగుట్ట బస్ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్నట్లు స్థానికులు తెలిపారు.
గుర్తుతెలియని వాహనం ఢీకొని..
త్రిపురారం: నిడమనూరు మండలంలోని ముప్పారం గ్రామానికి చెందిన మర్రి దుర్గయ్య (55) త్రిపురారం మండలంలోని నీలాయి గూడెంలో తన దగ్గరి బంధువుల్లోని వ్యక్తి చనిపోవడంతో అంత్యక్రియలకు వచ్చాడు. కార్యక్రమం పూర్తయిన అనంతరం బైక్‌పై నీలాయిగూడెం గ్రామం నుంచి ముప్పారం గ్రామానికి తిరిగి వెళ్తున్నాడు. ఈ క్రమంలో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో తలకు బలమైన గాయమైంది. దీంతో దుర్గయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు అక్కడకు చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
ఫ లారీ ఢీకొని మహిళ మృతి
Comments
Please login to add a commentAdd a comment