కోతులతో వెజిట్రబుల్
నల్లగొండ రూరల్: జిల్లాలో ఏటేటా కూరగాయల సాగు తగ్గుతూ వస్తోంది. జిల్లా ప్రజల అవసరాలకు తగ్గట్లుగా కూరగాయలు, ఆకుకూరల సాగు లేకపోవడంతో పక్క రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అయితే జిల్లాలో అన్ని రకాల కూరగాయలు, ఆకు కూరలు, సుగంధ ద్రవ్యాల సాగుకు నేలలు, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహం కరువైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కూరగాయలు, ఆకుకూరలు సాగు చేసినా కోతులు బతకనివ్వవనే భయాందోళనతో రైతులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. చెరువులు, గుట్టల ప్రాంతాలు ఉన్న మండలాల్లో కూరగాయల తోటలను వానర సైన్యం వచ్చి విధ్వంసం సృష్టిస్తున్నాయి. మిర్చి పంట మినహా ఇతర అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరల తోటలను నాశనం చేస్తున్నాయి. పందిరి కూరగాయల సాగు చేసిన రైతులు సైతం కోతుల బెడద నుంచి తప్పించుకోలేకపోతున్నారు. కోతులను నివారించేందుకు రైతులు టపాసులు పేల్చడం, అధిక శబ్దం వచ్చేలా చప్పుడు చేయడం, మంకీగన్స్ ఉపయోగించడం, చేల చుట్టూ జే వైర్ లాంటివి కడుతున్నా వాటి సమస్య తీరడం లేదు. దీంతో చేసేదేమీ లేక రైతులు కూరగాయలకు బదులు వరిసాగు వైపు మళ్లుతున్నారు. ఫలితంగా కూరగాయల సాగు తగ్గుతోంది.
ప్రభుత్వం ప్రోత్సహించక..
ఎనిమిదేళ్ల ఏళ్ల క్రితం జిల్లాలోని రైతులు చాలా ప్రాంతాల్లో అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలతోపాటు పుచ్చ సాగును విరివిగా చేపట్టేవారు. నాలుగైదేళ్లుగా రైతులకు ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహం అందడం లేదు. డ్రిప్, కూరగాయల విత్తనాలు, ట్రాన్స్‌పోర్టుకు అవసరమయ్యే పెట్టెలు, మల్చింగ్ షీట్స్, మందు పంపులు ఇవ్వకపోవడంతో రైతులు కూరగాయల సాగును తగ్గించారు. బోర్ల ద్వారా నీటిని పారించడం వల్ల విద్యుత్ వినియోగం పెరగడంతో పాటు భూగర్భ జలాలు తగ్గడం, కూలీల ఖర్చు పెరిగి రైతుకు పెట్టుబడి అధికమైంది. దీంతో కూరగాయల సాగుకు రైతులు ముందుకు రావడం లేదు.
కూరగాయలు పండే ప్రాంతాలివే...
జిల్లాలో పట్టణ ప్రాంత సమీప గ్రామాల్లో ఎక్కువగా కూరగాయల సాగు చేస్తున్నారు. నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ, హాలియా, నకిరేకల్, చిట్యాల, మాల్, కొండమల్లేపల్లి ప్రాంతాల్లో వారంతాపు సంతలతో పాటు రోజూ కూరగాయలకు డిమాండ్ ఉంటుంది. మునుగోడు, దేవరకొండ, నాగార్జునసాగర్, నకిరేకల్ నియోజకవర్గాల్లో కూరగాయల సాగు ఎక్కువగా చేపడుతున్నారు.
ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి..
జిల్లా ప్రజల అవసరాలకు తగ్గట్లు ఇక్కడ కూరగాయల సాగు లేకపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి కూరగాయలు, ఆకుకూరలను దిగుమతి చేసుకుంటున్నారు. కర్నూలు నుంచి టమాట, మహారాష్ట్రలోని నాసిక్ లాసల్‌గ్రవ్ నుంచి ఉల్లిపాయలు, ఆగ్రా, పంజాబ్ నుంచి ఆలుగడ్డ, అనంతపురం, మదనపల్లి నుంచి టమాట, గుంటూరు నుంచి మిర్చి, బెంగళూరు నుంచి ఆకుకూరలు, క్యారెట్, బీట్‌రూట్ దిగుమతి చేసుకుంటున్నారు. ఎన్‌ఐఎన్ లెక్కల ప్రకారం ప్రతి వ్యక్తి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే రోజు 300 గ్రాముల కూరగాయలు వినియోగించాలి. అంటే జిల్లాకు 600 టన్నుల కూరగాయల అవసరం. కానీ జిల్లాలో ఆస్థాయిలో కూరగాయల దిగుబడి లేదు. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి 450 టన్నుల కూరగాయలను దిగుమతి చేసుకుంటున్నట్లు ఒక అంచనా.
పందిరి సాగు తొలగించాలి
నల్లగొండ పట్టణం దగ్గరగా ఉండడంతో నాలుగు ఎకరాల్లో కూరగాయల సాగు చేపట్టారు. ఎకరన్నరలో రాతి కడ్డీలతో పందిరి సాగుకు రూ.3 లక్షలు ఖర్చు చేసి తీగ జాతి కూరగాయలు పండించాను. ఎకరంలో టమాట, బెండ, దోస ఇతర కూరగాయలు సాగు చేశాను. కోతుల బెడద ఎక్కువై పంటను నాశనం చేస్తున్నాయి. దీంతో పొలం వద్దే ఉంటూ కోతుల నివారణకు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ పంటలను కాపాడుకోలేకపోయాను. చేసేదేమీ లేక పందిరి సాగును తొలగించి వరిసాగు చేసేందుకు నారు పోశాను. నాలాగే చాలా మంది రైతులు కోతుల బెడదతో వేగలేక కూరగాయల సాగును చేపట్టడం లేదు.
– గోపగాని విజయ్,
దండెంపల్లి, నల్లగొండ మండలం
ఫ కూరగాయల పంటలను నాశనం చేస్తున్న వానరమూక
ఫ ఏటేటా తగ్గుతున్న సాగు విస్తీర్ణం
ఫ ప్రభుత్వ ప్రోత్సాహమూ అంతంతే..
ఫ ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాకు రోజూ 450 టన్నుల కూరగాయలు దిగుమతి
కూరగాయల సాగు లెక్కలు ఇవీ..
సంవత్సరం సాగు విస్తీర్ణం
2023 3,200 హెక్టార్లు
2024 2,800 హెక్టార్లు
Comments
Please login to add a commentAdd a comment