ఆహారం కల్తీమయం!
ఫ హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో
విచ్చలవిడిగా అమ్మకాలు
ఫ హానికరమైన రంగులు,
రసాయనాలు కలుపుతూ తయారీ
ఫ ఫుడ్ సేఫ్టీ అధికారులు కేసులు
పెడుతున్నా తీరుమారని నిర్వాహకులు
ఫ ప్రజారోగ్యానికి పొంచి ఉన్న ముప్పు
నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులే..
ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి ఆహార పదార్థాల తయారీలో హానికరమైన రంగులు, రసాయనాలు వినియోగిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రతి వ్యాపారి తప్పనిసరిగా ప్రభుత్వ నిబంధనలు పాటించాలి. నిబందనలు అతిక్రమిస్తే కేసులు నమోదు చేస్తాం.
– స్వాతి, ఫుడ్ సేఫ్టీ ఇన్‌స్పెక్టర్, నల్లగొండ
నల్లగొండ టూటౌన్: జిల్లాలోని పలు హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో కల్తీ ఆహార పదార్థాలు యథేచ్ఛగా విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ముఖ్యంగా పట్టణాల్లో వివిధ హోటళ్ల యజమానులు చూడగానే నోరూరించేలా ఆకర్షనీయమైన రంగులు, హానికరమైన రసాయనాలు కలుపుతూ ఘుమఘుమ వాసనలు వచ్చే ఆహారపదార్థాలు తయారు చేస్తున్నారు. వీటిని తిని ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. హానికరమైన రంగులు, రసాయనాలు వినియోగించవద్దని ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరిస్తూ.. తరచూ తనిఖీలు చేస్తూ.. కేసులు నమోదు చేస్తున్నా హోటళ్ల యజమానులు తీరుమార్చుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రముఖ హోటళ్లతోపాటు ఫాస్ట్‌పుడ్ సెంటర్లలోనూ హానికరమైన రంగులు, రసాయనాలతో చేస్తున్న ఆహార పదార్థాల వల్ల వాటిని తినే ప్రజలకు క్యాన్సర్, ఊబకాయం, గ్యాస్ట్రిక్, అల్సర్, కడుపు మంట లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. అదేవిధంగా రకరకాల బిర్యానీలను కూడా ఇలాగే చేస్తూ విక్రయిస్తున్నారని, దీంతో ప్రజారోగ్యానికి ముప్పు పొంచి ఉందని పలువురు ఆరోపిస్తున్నారు.
ప్రముఖ హోటళ్లదీ అదే దారి..
జిల్లాలోని ముఖ్య పట్టణాలైన నల్లగొండ, మిర్యాలగూడ, చిట్యాల, నార్కట్‌పల్లి, నకిరేకల్, దేవరకొండ, హాలియా లాంటి ప్రాంతాల్లో ప్రముఖ హోటల్స్ సైతం హానికరమైన రంగులు, రసాయనాలు వినియోగిస్తూ వివిధ ఆహార పదార్థాలు, ఫ్రైలు చేస్తూ వినియోగదారులను బురిడీ కొట్టిస్తున్నాయి. కల్తీ ఆహార పదార్థాల వినియోగంపై ఫుడ్‌సేఫ్టీ అధికారులు క్రిమినల్ కేసులు పెడుతున్నా వ్యాపారులు మాత్రం మరికొన్ని రోజుల తర్వాత అదేతంతు కొనసాగిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇష్టానుసారంగా వ్యవహరించే హోటల్స్ పట్ల కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం ఇటీవల ఫుడ్ సేఫ్టీ అధికారుల సమీక్షలో దిశానిర్దేశం చేసింది. ఈ నేపథ్యంలో కొన్ని రోజులుగా ఫుడ్ సేఫ్టీ అధికారులు జిల్లాలోని పలు హోటళ్లపై దాడులు చేసి కేసులు నమోదు చేశారు
తనిఖీల్లో భాగంగా ఇటీవల జిల్లా ఫుడ్ సేఫ్టీ ఇన్‌స్పెక్టర్ స్వాతి నల్లగొండలోని ఓ హోటల్‌లో వండిన ఆహార పదార్థాలను పరిశీలించారు. అలాగే మిర్యాలగూడలోనూ పలు హోటళ్లలో తనిఖీ చేసి ఆయా హోటళ్లలో తయారు చేసిన ఆహార పదార్థాల శాంపిల్స్ తీసుకొని పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపగా కల్తీమయంగా ఉన్నాయని తేలింది. దీంతో పలు హోటల్స్‌పై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేశారు. అప్పటి నుంచి తరచుగా హోటళ్లలో తనిఖీలు జరుగుతూనే ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment