‘పైలెట్’తో పరిష్కారం!
తిరుమలగిరిసాగర్ మండలంలో కొలిక్కి వస్తున్న భూ సమస్యలు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : తిరుమలగిరి సాగర్ మండలంలో భూ సమస్యల పరిష్కారం కొలిక్కి వస్తోంది. రాష్ట్రంలో అత్యధికంగా భూ సమస్యలు నల్లగొండ జిల్లా తిరుమలగిరిసాగర్ మండలంలోనే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆ మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి సమస్యల పరిష్కారానికి పూనుకున్న విషయం తెలిసిందే. జిల్లా కలెక్టర్‌గా నారాయణరెడ్డి పని చేసిన సమయంలో ప్రత్యేక అధికారిని నియమించి మండలంలో ఉన్న భూ సమస్యలను పరిష్కరించేందుకు క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టారు. ఆ ప్రక్రియ ప్రసుతం చివరి దశకు చేరుకుంది. అర్హులైన వారికి ఈ నెలాఖరులో సీఎం రేవంత్‌రెడ్డి చేతులమీదుగా పట్టాలు పంపిణీ చేసేందుకు జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది.
గత అధికారుల ఇష్టారాజ్యం
గతంలో మండలంలో రెవెన్యూ శాఖలో పని చేసిన వారు కొందరు ఇష్టానుసారంగా వ్యవహరించారు. భూమి ఎక్కడ ఉందో తెలియకపోయినా రికార్డుల్లో ఎక్కించారు. ప్రస్తుతం వాటన్నింటిని పరిశీలించి అర్హులను గుర్తిస్తున్నారు. ప్రధానంగా కబ్జాలో లేకుండా కాగితాల్లోనే పేర్లు ఉన్న వారి దరఖాస్తులను తిరస్కరించే ప్రక్రియ కొనసాగుతోంది.
మండలంలో మూడు రకాల భూములు
నాగార్జున సాగర్ ప్రాజెక్టును ఆనుకుని ఉన్న తిరుమలగిరి సాగర్ మండలంలో 2800 ఎకరాలు కాందిశీకుల భూములు (ఎవాక్యూ ప్రాపర్టీ), 4500 ఎకరాలు అటవీ భూములు, మిగితావి ప్రభుత్వ భూములు ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. వచ్చిన దరఖాస్తుల్లో కొందరు ఫారెస్టు భూముల్లో, ఎవక్యూ ప్రాపర్టీలో, ప్రభుత్వ భూముల్లో సాగు చేసుకుంటున్న వారు ఉన్నారు. మొత్తానికి ఇప్పటివరకు 4 వేల మందికిపైగా అర్హులైన రైతులు ఉన్నట్లుగా అధికారులు తేల్చారు. ప్రభుత్వ భూమికి పట్టాలు జారీ చేసే అధికారం కలెక్టర్‌కు ప్రభుత్వం ఇటీవల ఇచ్చింది. దీంతో వాటిల్లో పట్టా సర్టిఫికెట్లను కలెక్టర్ జారీ చేయవచ్చు. అయితే కాందిశీకుల భూములు, అటవీ భూముల్లో సాగు చేసుకుంటున్న వారికి పట్టాలు ఎలా జారీ చేయాలనే విషయంలో జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి నివేదిక పంపింది.
ఫ ప్రత్యేక అధికారి నేతృత్వంలో 23 వేలకుపైగా ఎకరాల్లో సర్వే పూర్తి
ఫ కాగితాల్లోనే ఉన్న అనర్హుల పేర్లు తొలగింపు
ఫ సాగు చేసుకుంటున్న వారికే పట్టాలు ఇచ్చేలా చర్యలు
ఫ ఈ నెలాఖరులో సీఎం చేతుల మీదుగా పట్టాల పంపిణీ
పట్టాలుంటే భూమి లేదు.. భూమి ఉంటే పట్టాల్లేవ్
తిరుమలగిరి సాగర్ మండలంలో మండలంలోని 27 వేల ఎకరాలకు పైగా భూమి ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ఆయా భూముల్లో చాలా మందికి పట్టాలు ఉంటే భూమి లేదు.. భూమి ఉన్న వారికి పట్టాలు లేవని జిల్లా యంత్రాంగం గుర్తించింది. ఆ భూముల్లో అందులో పట్టాల కోసం దాదాపు 24 వేల ఎకరాల్లో సర్వే చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని ప్రత్యేక అధికారి నేతృత్వంలో 14 రెవెన్యూ, సర్వే బృందాలు, 80 మంది సిబ్బందితో సర్వే నిర్వహించింది. ఆ సర్వే దాదాపు 95 శాతం వరకు సర్వే పూర్తి కావచ్చినట్లు అదనపు కలెక్టర్ శ్రీనివాస్ పేర్కొన్నారు.
ఈ నెలలోనే రైతులకు పట్టాలు
తిరుమలగిరి సాగర్ మండలంలో అర్హులైన వారికి పట్టాలు జారీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దానికి సంబంధించిన సర్వే దాదాపు పూర్తి కావచ్చింది. సీఎం రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటన ముగిసిన తర్వాత ఈ నెలాఖరులోగా ఆయన చేతుల మీదుగా పట్టాల పంపిణీకి చర్యలు చేపడుతున్నాం. వాటిల్లో నియోజవకర్గంలో పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారు.
– కుందురూ జయవీర్‌రెడ్డి,
ఎమ్మెల్యే, నాగార్జునసాగర్
Comments
Please login to add a commentAdd a comment