రైతు భరోసాపై ఆశలు
రెండు సీజన్లకా.. ఒక సీజన్‌కా?
రైతుభరోసాను వానాకాలం, యాసంగి సీజన్లకు ఇస్తారా.. లేక ఒక్క యాసంగికి మాత్రమే అమలు చేస్తారా అనే సందేహం రైతుల్లో నెలకొంది. దీనిపై ప్రభుత్వం గానీ, వ్యవసాయ శాఖ గానీ.. ఎలాంటి స్పష్టతను ఇవ్వలేదు. రెండు సీజన్లకు రైతు భరోసా నిధులు ఖాతాల్లో జమచేయాలని రైతులు, రైతు సంఘాల నాయకులు కోరుతున్నారు.
నల్లగొండ అగ్రికల్చర్ : రైతు భరోసా (పెట్టుబడిసాయం)పై రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. రైతుభరోసాపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్‌కమిటీ అద్యయం చేయడంతో పాటు రైతుల అభిప్రాయాలను సేకరించి తుది నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. దీనిపై శనివారం నిర్వహించే రాష్ట్ర కేబినెట్ సమావేశంలో నిర్ణయం వెలువడనున్నట్లు తెలుస్తోంది. రైతు భరోసా ప్రక్రియ ప్రారంభంకానున్న నేపథ్యంలో యాసంగి పంటల నమోదును ఈ నెల 4న నుంచి 8వ తేదీ వరకు నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశించారు.
పంట పెట్టుబడులకు అవస్థలు
అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుబంధు పథకం పేరును రైతు భరోసాగా మార్చి ఎకరానికి రూ.7500లను అందిస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ గత వానాకాలం, ఇప్పటి యాసంగి సీజన్‌కు రైతుభరోసా ఇవ్వలేదు. రైతుభరోసాపై కేబినెట్ సబ్‌కమిటీని ఏర్పాటుచేసి నివేదిక తయారు చేసి తుది నిర్ణయం తీసుకుంటామని చెపుతూ కాలయాపన చేసింది. వానాకాలం సీజన్ నుంచి రైతుభరోసా నిధులు రైతుల జమ కాకపోవడంతో రైతులు పెట్టుబడుల కోసం అనేక అవస్థలు పడుతున్నారు.
సాగు చేసే రైతులకే..!
గతంలో జిల్లాలో 5,42,406 మంది రైతులకు ప్రతి సీజన్‌లో ఎకరానికి రూ.5 వేల చొప్పున రూ.624 కోట్లను రైతుల ఖాతాలో జమచేసే వారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం సాగు చేసిన భూములకు మాత్రమే రైతుభరోసా జమచేస్తామని, ఐటీ, ప్రభుత్వ ఉద్యోగులకు భరోసాను వర్తింపజేయమని గతంలోనే ప్రభుత్వం ప్రకటించింది. దానికి తోడు ఎన్ని ఎకరాల వరకు ఇవ్వాలనే దానిపై కూడా నిర్ణయం తీసుకోలేదు.
నేటి నుంచి యాసంగి పంటల నమోదు
ఈ నెల 4 నుంచి 8వ తేదీ వరకు యాసంగి పంటల నమోదు చేపట్టాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి వ్యవసాయశాఖ అధికారులకు ఆదేశించారు. శుక్రవారం ఆమె వ్యవసాయ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి పంటల నమోదుపై దిశనిర్దేశం చేశారు. భూసమస్యలు ఉన్న చోట వ్యవసాయ శాఖ అధికారులకు సహకరించాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. జిల్లాలోని అన్ని మండలాల్లో ఒక్కో గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసుకుని 500 ఎకరాల్లో మొదటి సర్వే నంబర్ నుంచి చివరి సర్వే నెంబర్ వరకు పంటల నమోదు చేయాలని స్పష్టం చేశారు. సర్వే నెంబర్, రైతు పేరు, ఏఏ సర్వే నంబర్‌లో ఏఏ పంట వేశారు. మొత్తం ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో సాగు చేశారు. పంట సాగు చేయని సర్వే నంబర్ దాని విస్తీర్ణం అన్నింటినీ ఆన్‌లైన్‌లో నమోదు చేయనున్నారు.
ఫ సంక్రాంతి నుంచి అమలు చేయనున్నట్లు ప్రచారం
ఫ నేడు ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం!
ఫ యాసంగి పంటలు నమోదు చేయాలని ఆదేశం
ఫ ఎన్ని సీజన్లకు జమచేస్తారనే విషయంపై స్పష్టత కరువు
5,83,620 ఎకరాల్లో సాగు అంచనా..
యాసంగి సీజన్‌లో 5,83,620 ఎకరాల్లో వరి ఇతర పంటలు సాగుకానున్నట్లు వ్యవసాయశాఖ అంచనాలు వేసింది. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 2,01,677 వరి, జొన్న 45 , సజ్జ 337, మొక్కజొన్న 207, ఆముదం 63, వేరుశనగ 20 వేల ఎకరాల్లో రైతులు సాగు చేశారు. పంటల నమోదు పూర్తి అయ్యే వరకు మరో 50 వేల ఎకరాల్లో మాత్రమే వరి సాగయ్యే అవకాశం ఉంది. పంటల నమోదు ప్రక్రియ పూర్తయ్యే ఈ ఐదు రోజుల్లో మూడు లక్షల ఎకరాల్లో పంటల సాగు కావు. అయితే.. రైతు భరోసా ఎన్ని ఎకరాలను లెక్క తీసుకుంటారోననే అనుమానం రైతుల్లో నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment