ఊరూరా సంబురం
ఫ మొదటి రోజు అంబరాన్నంటిన
భోగి వేడుకలు
ఫ చిన్నారులకు భోగి పళ్లు పోసిన పెద్దలు
ఫ రంగవల్లులతో వీధులన్నీ
శోభాయమానం
నేడు మకర సంక్రాంతి
రామగిరి (నల్లగొండ) : సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ మూడు రోజులు జరుపుకునే సంక్రాంతి పండుగ సంబరాలు ఊరూవాడా ఉత్సాహంగా సాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా సోమవారం భోగి పండగను ప్రజలు ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరుపుకున్నారు. బంధుమిత్రుల రాకతో పట్టణాలతోపాటు గ్రామాల్లోని ప్రతి ఇంటా సందడి నెలకొంది. వేకువ జామునే ఇళ్ల ముందు భోగి మంటలు వేశారు. ఉదయాన్నే మహిళలు రంగవల్లులతో ముంగిళ్లను కళాత్మకంగా తీర్చిదిద్దారు. ముగ్గుల మధ్యలో ఆవుపేడతో చేసిన గొబ్బెమ్మలు, గరక, పిండికూర, నవధాన్యాలు, పూలు, కూరగాయలు పెట్టి సూర్యదేవుడిని పూజించారు. మహిళలు, యువతులు, చిన్నారులు పోటీ పడి ముగ్గులు వేయడంతో వీధులు ఇంద్రధనస్సుల్లా శోభాయమానంగా కనిపించాయి. సాయంత్రం ముతైదువులను ఇళ్లకు పిలిచి చిన్నారులకు భోగిపండ్లు పోయించి ఆశీర్వచనాలు అందింపజేశారు.
పతంగుల సందడి
పట్టణంలో ఎటూచూసినా పతంగుల రెపరెపలే కనిపిస్తున్నాయి. పెద్దలు, యువత, చిన్నారులు ఉత్సాహంతో గాలిపటాలను ఎగురవేస్తూ కేరింతలు కొడుతున్నారు. రంగు రంగుల పతంగులను గాల్లోకి ఎగురవేస్తూ పిల్లలు ఆనందపరవశులవుతున్నారు. మంగళ, బుధవారాల్లో కూడా చిన్నారులు గాలిపటాలు ఎగురవేయనున్నారు. ఇదిలా ఉంటే వివిధ యువజన సంఘాల ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీతోపాటు యువతకు వివిధ రకాల పోటీలు నిర్వహిస్తున్నారు.
నేడు సంక్రాంతి
మూడు రోజుల సంక్రాంతి సంబరాల్లో మకర సంక్రాంతి విశేష పర్వదినం. సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించే ఈ పుణ్యదినాన సూర్యునికి అర్ఘ్యాలు ఇవ్వడం. పూజలు చేయడం, దానధర్మాలు చేయడం పరిపాటి. మొదటి రోజు భోగి వేడుకలు ముగియగా రెండో రోజు మంగళవారం మకర సంక్రాంతిని ప్రజలు ఘనంగా జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. కాల గమనం దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తున్నందున శరీరానికి సమతౌల్యం అవసరం. అందుకని చక్కెర, బెల్లం, నువ్వులతో చేసిన పిండి వంటలు తింటారు. సంక్రాంతిరోజు పొంగలి, పిండి వంటలు వండి పితృదేవతలకు తర్పణాలు వదులుతారు. ఈ సందర్భంగా గంగిరెద్దుల వాళ్లు ఇళ్ల ముందు డూడూ బసవన్నలు విన్యాసాలు చేస్తూ దీవెనలు అందిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment