నిజాయితీ చాటుకున్న బేకరీ యజమాని
కోదాడరూరల్: బేకరీలో మహిళ మర్చిపోయిన ల్యాప్‌టాప్‌ను తిరిగి ఆమెకు అప్పగించి నిజాయితీ చాటుకున్నాడు ఓ బేకరీ యజమాని. సూర్యాపేటకు చెందిన విజయలక్ష్మి సోమవారం కోదాడకు వచ్చింది. బస్టాండ్ పక్కనే విలాస్ బేకరీలో తన పిల్లలకు స్నాక్స్ కొనుగోలు చేసేందుకు వెళ్లింది. స్నాక్స్ కొనుగోలు చేసిన తర్వాత రూ.70వేల విలువైన తన ల్యాప్‌టాప్ బ్యాగును బేకరీలోనే మర్చిపోయి వెళ్లిపోయింది. బేకరీ యజమాని అక్కినపల్లి ఉపేందర్ ల్యాప్‌టాప్ బ్యాగును గుర్తించి భద్రపర్చాడు. ఆ రోజు రాత్రి వరకు చూసినా ఎవరూ రాకపోవడంతో మరుసటి రోజు పోలీసులకు అప్పగిద్దామనుకున్నాడు. మంగళవారం ఉదయం ఉపేందర్‌కు బేకరీ తీసేందుకు వెళ్లగా.. అప్పటికే విజయలక్ష్మి బేకరీ వద్దకు వచ్చి తన ల్యాప్‌టాప్ బ్యాగు మర్చిపోయానని చెప్పింది. సీసీ కెమెరాల ద్వారా ఆ బ్యాగు విజయలక్ష్మిదే అని నిర్ధారించుకున్న ఉపేందర్ ఆమెకు ల్యాప్‌టాప్ అప్పగించాడు.
పిన్‌కోడ్‌తో కూడిన
కరెన్సీ నోట్ల సేకరణ
యాదగిరిగుట్ట: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కు చెందిన కై లాష్ సంతోష్ పిన్‌కోడ్‌తో కూడిన కరెన్సీ నోట్లను సేకరించడం తన హాబీగా మార్చుకున్నారు. ఇటీవల యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చిన ఆయన యాదగిరిగుట్ట పిన్‌కోడ్(508115)తో కూడిన రూ.100 కరెన్సీ నోటును సేకరించాడు. గతంలో కొలనుపాక, భువనగిరి ప్రాంతాల పిన్‌కోడ్‌తో ఉన్న రూ.10 నుంచి రూ.500 వరకు కరెన్సీ నోట్లను సేకరించినట్లు ఆయన వెల్లడించారు.
పిచ్చి కుక్క దాడిలో పలువురికి గాయాలు
యాదగిరిగుట్ట: పిచ్చి కుక్క దాడిలో పలువురికి గాయాలయ్యాయి. యాదగిరిగుట్ట పట్టణంలోని బీసీ కాలనీలో మంగళవారం రాత్రి పిచ్చి కుక్క దాడి చేయడంతో గొడిసెల నర్సింహ, మురళి, అనూష, విక్కీ తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను చికిత్స నిమిత్తం స్థానికులు యాదగిరిపల్లి పీహెచ్‌సీకి తరలించారు. పిచ్చి కుక్కను స్థానికులు వెంటాడి చంపేశారు.
Comments
Please login to add a commentAdd a comment