అధ్యయనోత్సవాలు పరిసమాప్తం
యాదగిరిగుట్ట: యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గత ఆరు రోజులుగా జరుగుతున్న అధ్యయనోత్సవాలు బుధవారం ముగిశాయి. చివరిరోజు స్వామివారిని లక్ష్మీనరసింహస్వామిగా అలంకరించి ఆలయ తిరు, మాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం ఆలయ అద్దాల మండంలో స్వామివారిని అధిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు. అలంకార సేవ ఊరేగించిన తర్వాత ‘ఇరామానుజనుత్తిందారి ఉపదేశరత్తినమాలై’ అనుసంధానం నిర్వహించి అధ్యయనోత్సవాలను ముగించారు. అధ్యయనోత్సవాలకు వచ్చిన దివ్య ప్రబంధ పారాయణీకులను ఆలయ ఈఓ భాస్కర్‌రావు, అనువంశిక ధర్మకర్త బి. నర్సింహమూర్తి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. అంతకుముందు నిత్యారాధనలు నిర్వహించి, పారాయణీకులచే ఆళ్వారుదుల ముందు ప్రబంధ పారాయణం నిర్వహించారు. ఉత్సవమూర్తులకు తిరుమంజన, నవకలశస్నపన మహోత్సవాన్ని ఆచార్యులు చేపట్టారు.
నేటి నుంచి పునఃప్రారంభం..
అధ్యయనోత్సవాల్లో భాగంగా ఈ నెల 10వ తేదీ నుంచి బుధవారం వరకు రద్దు చేసిన సుదర్శన నారసింహ హోమం, నిత్య, శాశ్వత కల్యాణాలు, బ్రహ్మోత్సవం వంటి పూజలను గురువారం నుంచి తిరిగి ప్రారంభించనున్నారు.
చివరిరోజు లక్ష్మీనరసింహుడి అలంకరణలో స్వామివారు
Comments
Please login to add a commentAdd a comment