ఏటీఎంల వద్ద మోసం చేస్తున్న నిందితుల అరెస్ట్
పెద్దవూర: ఏటీఎం సెంటర్ల వద్ద వృద్ధులకు మాయమాటలు చెప్పి వారి ఏటీఎం కార్డులను దొంగిలించి నగదు డ్రా చేసుకుంటున్న నిందితులను బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు నాగార్జునసాగర్ సీఐ బీసన్న తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దవూర మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన వృద్ధుడు తూళ్ల బొబ్బిలి తన ఏటీఎం కార్డుతో గతేడాది ఆగస్టు 30న మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంకు ఏటీఎం నుంచి నగదు డ్రా చేయడానికి వెళ్లాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా తనకల్లు మండలానికి చెందిన కృష్ణమూర్తి, ఒంగోలు టౌన్‌కు చెందిన బొడ్డు సుబ్బారావు, బాపట్ల జిల్లా చేరాల మండలం మరియంపేట గ్రామానికి చెందిన ఉండ్రాళ్ల కుమార్‌బాబు బొబ్బిలి ఏటీఎం సెంటర్లోకి వెళ్లడం గమనించారు. వీరిలో ఇద్దరు ఏటీఎం సెంటర్లోకి ప్రవేశించారు. ఏటీఎం కార్డు వాడటం రాని బొబ్బిలి డబ్బులు డ్రా చేసి ఇవ్వాలని వీరిని అడుగగా.. పిన్ నంబర్ తెలుసుకుని డబ్బులు డ్రా కావడం లేదని చెప్పి వారి వద్ద ఉన్న పనిచేయని ఏటీఎం కార్డు ఇచ్చి బొబ్బిలికి ఇచ్చారు. అపహరించిన ఏటీఎం కార్డుతో కొండమల్లేపల్లిలోని ఎస్బీఐ ఏటీఎం సెంటర్ నుంచి రూ.40వేలు డ్రా చేసుకున్నారు. బొబ్బిలి తన అకౌంట్లో డబ్బులు కట్ అయ్యాయని బ్యాంకుకు వెళ్లగా కొండమల్లేపల్లి ఎస్బీఐ ఏటీఎం నుంచి డ్రా అయినట్లు తెలిపారు. దీంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా... సీసీ కెమెరాలను పరిశీలించగా పోలీసులు ముగ్గురు దొంగలు మోసానికి పాల్పడినట్లు గుర్తించి కేసు నమోదు చేశారు. బుధవారం పెద్దవూర మండల కేంద్రంలో ముగ్గురు వ్యక్తులు ఏటీఎం కేంద్రం వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో పోలీసులకు అనుమానం వచ్చి పట్టుకున్నారు. పోలీసుల విచారణలో బొబ్బిలి ఏటీఎం కార్డు దొంగిలించి డబ్బు డ్రా చేసుకున్నట్లు నిజం ఒప్పుకున్నారు. వీరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితులను పట్టుకున్న ఎస్ఐ పి. వీరబాబు, సిబ్బంది శ్రీకాంత్, కిషన్‌నాయక్, లోకేష్‌రెడ్డి, హరిలాల్లను సీఐ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment