30 స్కూళ్లలో పార్క్‌లు ఏర్పాటు...
మిర్యాలగూడ : భవిష్యత్‌లో రోడ్డు ప్రమాదాలను అరికట్టాలంటే విద్యార్థి దశ నుంచే విద్యార్థులకు ట్రాఫిక్‌పై అవగాహన కల్పించాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగా కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌గడ్కరీ కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. దేశ వ్యాప్తంగా యునిసెఫ్ సహకారంతో అన్ని పాఠశాలల్లో చిల్డ్రన్స్ ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తెలంగాణలో కూడా ఈ పార్క్‌లను ఏర్పాటు చేసి విద్యార్థులకు ట్రాఫిక్‌పై అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఈ పార్క్‌లను ఏర్పాటు చేయాలని, అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
రెండు వేల చదరపు గజాల స్థలం తప్పనిసరి..
చిల్డ్రన్స్ ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్ ఏర్పాటు కోసం ఆయా పాఠశాలల్లో రెండు వేల చదరపు గజాల స్థలాన్ని కేటాయించాల్సి ఉంది. ఆ స్థలంలో ట్రాఫిక్ నిబంధనలు, సూచికలు, సిగ్నల్స్, బోర్డులతో కూడిన మ్యాప్‌లను కలర్లతో తీర్చదిద్దనున్నారు. దీంతో పాటు ట్రాఫిక్ రూల్స్ చూపేందుకు అవసరమైన మిషనరీని వినియోగించాల్సి ఉంది. దీనికి ఒక్కో పార్క్ ఏర్పాటుకు సుమారు రూ.4లక్షల ఖర్చు అవుతుంది. ఈ ఖర్చు కూడా ఆయా పాఠశాలల యాజమాన్యం భరించాల్సి ఉంటుంది. లేకపోతే ఆయా గ్రామాల్లో దాతల సహకారంతో తీసుకోవచ్చు. ఈ పార్క్‌ను పాఠశాలల్లో ఉండడం వల్ల ప్రతి విద్యార్థి ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పొందే అవకాశం ఉంటుంది. దీని వల్ల ఆ విద్యార్థి పెరిగి పెద్దయిన తరువాత ట్రాఫిక్ నిబంధనలు పాటించినట్లయితే భవిష్యత్‌లో రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయి.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 30కి పైగా పాఠశాలల్లో పార్క్‌లను ఏర్పాటు చేయాలని రవాణాశాఖ అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే హైదరాబాద్‌లో 15 పాఠశాలల్లో పార్క్‌లు ఏర్పాటుకు సన్నాహాలు చేపట్టారు. త్వరలోనే ఉమ్మడి జిల్లాలో కూడా పార్క్‌లను ఏర్పాటు చేసేందుకు పాఠశాలలను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. సరిపడా స్థలం, వనరులు ఉన్న పాఠశాలలనే ఎంపిక చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment