వలిగొండ: మండలంలోని గోకారం గ్రామానికి చెందిన కల్లుగీత కార్మికుడు మద్దెల సత్తయ్య ఆదివారం తాటి చెట్టు ఎక్కే క్రమంలో ప్రమాదవశాత్తు చెట్టు పైనుంచి పడ్డాడు. దీంతో అతడి కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. సత్తయ్యను భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స నిర్వహించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బాధితుడికి ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా అందజేయాలని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు మద్దెల రాజయ్య, గాజుల ఆంజనేయులు ప్రభుత్వాన్ని కోరారు.
రోడ్డు ప్రమాదంలో
వ్యక్తికి తీవ్రగాయాలు
పెద్దవూర: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి తీవ్రంగా గాయపడిన సంఘటన పెద్దవూర మండల కేంద్రంలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గుర్రంపోడు మండలం బొల్లారం గ్రామానికి చెందిన నిమ్మల సతీష్ ఆదివారం ముసలమ్మచెట్టు గ్రామం నుంచి పెద్దవూరకు తన ద్విచక్రవాహనంపై వెళ్తున్నాడు. ఈ క్రమంలో మండల కేంద్రంలోని వై జంక్షన్ సమీపంలో మల్లిఖార్జున ఫంక్షల్ హాల్ వద్ద హాలియా వైపు నుంచి వస్తున్న లారీ సతీష్ బైక్‌ను వెనక నుంచి ఢీ కొట్టింది. దీంతో లారీ టైర్లు సతీష్ కుడి చేతిపై నుంచి వెళ్లడంతో పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. అటుగా వెళ్తున్న వాహనదారులు గమనించి 108 వాహనానికి ఫోన్ చేసి సమాచారం అందించడంతో చికిత్స నిమిత్తం నాగార్జునసాగర్ కమలానెహ్రూ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. సతీష్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వీరబాబు తెలిపారు.
బైక్ అదుపుతప్పి
వృద్ధుడు మృతి
మర్రిగూడ: ద్విచక్రవాహనం అదుపుతప్పి వృద్ధుడు మృతిచెందిన సంఘటన మర్రిగూడ మండలంలోని రాంరెడ్డిపల్లి గ్రామ శివారులో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ మునగాల కృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం లోయపల్లికి చెందిన బూడిద రాములు(70) నాంపల్లి మండలంలోని వడ్డెపల్లిలో ఉంటున్న తన కోడలు, పిల్లలను చూసేందుకుగాను సాయంత్రం సమయంలో గ్రామం నుంచి బయలుదేరాడు. చర్లగూడెం, రాంరెడ్డిపల్లి గ్రామాల మూలమలుపు వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి కింద పడడంతో రాములు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉండగా చిన్న కుమారుడు మృతిచెందాడు. పెద్ద కుమారుడు బూడిద ఎల్లయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
కుక్కల దాడిలో
14 గొర్రెలు మృతి
మోటకొండూర్: మండలంలోని మాటూర్ గ్రామానికి చెందిన జెన్నె చిన్న భిక్షపతికి చెందిన గొర్రెలను పాకలో తోలగా శనివారం రాత్రి కుక్కలు దాడి చేశాయి. దీంతో 14గొర్రెలు మృతి చెందగా 10 గొర్రెలు గాయపడ్డాయి. ఈమేరకు భిక్షపతి అధికారులకు సమాచారం ఇవ్వటంతో ఆర్‌ఐ రామారావు సంఘటనా స్థలానికి చేరుకుని పంచనామా చేశారు. గొర్రెల విలువ సుమారు రూ.1.5 లక్షలు ఉంటాయని బాధితుడు తెలిపాడు. ప్రభుత్వం తనను ఆదుకోవాలని కోరాడు.
Comments
Please login to add a commentAdd a comment