పూత నిలిస్తేనే మామిడి దిగుబడి
నడిగూడెం: ప్రతి ఏటా మామిడి పూత విరివిగా రావడం.. ఇంతలోనే మంచు కారణంగా పూత మాడిపోయి రాలిపోవడం సర్వసాధారణం. దీని వల్ల ఆశించిన దిగుబడి రాక రైతులు కుదేలవుతున్నారు. పూత నిలబడాలంటే సమగ్ర యాజమాన్యం తప్పనిసరి అని హార్టికల్చర్ కన్సల్టెంట్ సుందరి సురేష్ చెబుతున్నారు. మామిడి సాగులో పాటించాల్సిన జాగ్రత్తలు ఆయన మాటల్లోనే..
ప్రస్తుతం తోటలు పూత దశలో ఉన్నాయి. ఆ తర్వాత కాపునకు వస్తాయి. ఈ నెలలో తోటల్లో భూమిని చదును చేయాలి. దున్నాలి. దీని వల్ల కలుపు నివారణతో పాటు, చెట్లకు పూత రావడానికి సహకరిస్తుంది. తోటల్లో ఉండే పిండి పురుగులు, పండు ఈగ, కోశస్థ దశలో నశిస్తాయి. దుక్కులు సాలుకు అడ్డంగా దున్నాలి. తోటలో సాలును బట్టి ప్రతి 10 నుంచి 15 చెట్లకు పెద్ద అడ్డుకట్టలు వేయాలి. దీని వల్ల వర్షపు నీరు, సత్తువ బయటకు పోకుండా ఉంటుంది. నేలలో తేమ బాగా ఉంటుంది. ఎండుపుల్ల రాదు. వేరుకుళ్లు కూడా ఆశించదు.
సూక్ష్మపోషకాలు ఏటా అవసరం
మామిడితోటల్లో రకకరకాల సూక్ష్మదాతులోపాలు కనిపిస్తాయి. కాయలు కోసిన తరువాత చెట్లు చక్కగా తయారు కావడానికి జింక్‌సల్ఫేట్ 5 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఆ తరువాత సూక్ష్మదాతువులైన జింక్, మెగ్నీషియం, ఇనుము, బోరాన్,, మాంగనీస్, ద్రావణాన్ని తయారు చేసి కొత్త ఆకులు తొడిగేటప్పుడు వేయాలి.
ఈ సీజన్‌లో మామిడి తోటలపై
అప్రమత్తంగా ఉండాలి
హార్టికల్చర్ కన్సల్టెంట్
సుందరి సురేష్ సూచనలు
ఎరువుల యాజమాన్యం
ముఖ్యంగా పొటాష్, భాస్వరం వేసుకుంటే మంచి ఫలితాన్నిస్తుంది. నత్రజని వేయకూడదు. నత్రజని ఎరువు వేయడం వలన ఆకులు పెరిగిపోతాయి తప్ప పెద్దగా ప్రయోజనం ఉండదు. చెట్ల వయస్సును బట్టి ఎరువులు వేయాలి. ఏడాది వయస్సు గల చెట్టుకుపశువుల ఎరువు లేదా వర్మి కంపోస్టు 10 కిలోలు, యూరియా 200 గ్రాములు, సూపర్ పాస్పేట్ 500 గ్రాముల ప్రకారం వేయాలి. రెండేళ్ల వయస్సున్న చెట్టు ఒక్కోదానికి పశువుల ఎరువు 20 కిలోలు, యూరియా 400 గ్రాములు, సూపర్‌పాస్పేట్ ఒక కిలో, పొటాష్ 300 గ్రాములు వేయాలి. పదేళ్ల చెట్టు ఒక్కోదానికి పశువుల ఎరువు 50 కిలోలు, యూరియా ఒక కిలో, సూపర్ పాస్పేట్ 2500 గ్రాములు, మ్యూరెట్ ఆఫ్ పొటాష్ 750 గ్రాములు వేయాలి. 10 ఏళ్లు, ఆపైన వయస్సు గల చెట్లకు ఒక్కోదానికి టన్ను పశువుల ఎరువు, యూరియా 2 కిలోలు, సూపర్ పాస్పేట్ 500 గ్రాములు, మ్యూరెట్ ఆఫ్ పొటాష్ 1500 గ్రాములు వేసుకోవాలి. ఈ ఎరువులన్నీ సమపాళ్లలోనే వేయాలి.
Comments
Please login to add a commentAdd a comment