వేటగాళ్ల అరెస్ట్ చూపుతున్న అటవీశాఖ ఎఫ్‌ఆర్‌ఓ, సిబ్బంది
● నాలుగు నాటు తుపాకులు, రెండు కత్తులు స్వాధీనం
మహానంది: బండిఆత్మకూరు మండలం నారపురెడ్డి కుంట బీట్ సమీపంలోని బాలయ్యకుంట ప్రదేశంలోని నల్లమల అడవిలో వేటకు వెళ్లిన ఐదుగురు వన్యప్రాణుల వేటగాళ్లను అరెస్ట్ అటవీ అధికారులు అరెస్ట్ చేశారు. బండిఆత్మకూరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ నాసిర్‌జా తెలిపిన వివరాల మేరకు .. నారాయణాపురం, ఏ.కోడూరు గ్రామాలకు చెందిన మాచగొండ నాగరాజు, బండపల్లె చిరంజీవి, ఆలం ఫక్కీర్‌హుసేన్, పఠాన్ పెద్దమౌలాలి, షేక్ హుసేన్‌వలి నల్లమలలో అనుమానాస్పదంగా సంచరిస్తుండగా పట్టుకున్నారు. వారి నుంచి నాలుగు నాటుతుపాకులు, అందుకు వినియోగించే తొమ్మిది రవ్వలు, రెండు కత్తులు స్వాధీనం చేసుకున్నారు. వన్యప్రాణులను వేటాడితే ఏడేళ్ల నుంచి జీవితాంతం జైలుశిక్ష పడుతుందని హెచ్చరించారు. నల్లమలలో అనుమానాస్పదంగా తిరిగే వారిపై నిరంతరం నిఘా ఉంచామన్నారు. నల్లమల సమీప గ్రామాల ప్రజలు వన్యప్రాణుల వేటగాళ్లపై 98855 09574కు సమాచారం అందించాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. సమావేశంలో అటవీశాఖ డీఆర్‌ఓ నాగేంద్రనాయక్, ఎఫ్‌ఎస్‌ఓలు విజయలక్ష్మీ, సుబ్బయ్య, తేజ, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment