ఎన్నికల హామీ అమలెప్పుడో?
పేదలందరికీ ఇళ్లు నిర్మించి వారి కలను నెరవేర్చేందుకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. జగనన్న కాలనీల పేరుతో కొత్త ఊళ్లనే నిర్మించింది. ఆరునెలల క్రితం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కొత్త గృహాలు మంజూరు చేయకపోగా జగనన్న కాలనీలపై కక్షగట్టింది. రోడ్లు, డ్రెయినేజి, వీధిలైట్లు, తదితర మౌలిక సదుపాయాల కల్పనతో పాటు గృహ నిర్మాణ బిల్లుల చెల్లింపులో అంతులేని నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. ఫలితంగా గతంలో గృహాలు మంజూరైన లబ్ధిదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
త్వరితగతిన బిల్లులు విడుదల చేయాలి
గతంలో మంజూరైన ఇళ్ల నిర్మాణాల బిల్లులను త్వరితగతిన విడుదల చేయాలి. పట్టణ శివారులోని ఎస్సార్బీసీ కాలనీలో ఇంటి నిర్మాణం చేపట్టాను. బిల్లుతో పాటు సిమెంట్, కడ్డీలు, ఇసుక, తదితర ఇంటి నిర్మాణ సామగ్రిని సరఫరా చేసి పేదలకు సొంతింటి కల నెరవేర్చాలి.
– శ్రీనివాసనాయక్, లబ్ధిదారుడు, కోవెలకుంట్ల
మౌలిక వసతులు కల్పించాలి
జగనన్న కాలనీల్లో మౌలిక వసతులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అంతర్గత రహదారులు, డ్రెయినేజి, వీధిదీపాలు, తాగునీరు, తదితర మౌలిక వసతులు కల్పించాలి. పట్టించుకోకపోతే లబ్ధి దారులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతాం.
– సుధాకర్, సీఐటీయూ నేత, కోవెలకుంట్ల
కోవెలకుంట్ల: గత ప్రభుత్వం జిల్లాలోని 29 మండలాల పరిధిలో 323 జగనన్న కాలనీలతోపాటు, సొంత స్థలం ఉన్న లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకునేందుకు 56,523 పక్కాగృహాలు కేటాయించింది. ఈ ఏడాది మార్చి నాటికి ఆయా మండలాల్లో 30,713 పక్కాగృహాలు పూర్తి కాగా 15 వేల ఇళ్లు బేస్‌మెంట్, మిగిలిన ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. ప్రస్తుత కూటమి ప్రభుత్వం కొత్త ఇళ్లు ఇవ్వకపోగా గతంలో ప్రారంభించిన ఇళ్లను వచ్చే ఏడాది మార్చి లోపు పూర్తి చేయాలని నిబంధన విధించింది. వివిధ దశల్లో ఉన్న ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన పురోగతిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పటి వరకు ప్రారంభం కాని గృహ నిర్మాణాలను పూర్తిగా నిలిపివేసింది. కొత్త ఇళ్ల మంజూరు ఊసే పట్టించుకోకపోవడంతో పేదలకు సొంతింటి కల అందనంత దూరంలో ఉంది. దీనికి తోడు గతంలో మంజూరైన ఇళ్ల నిర్మాణాలకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.
ఊళ్లను నిర్మించిన వైఎస్సార్‌సీపీ సర్కార్
వైఎస్‌జగన్ ప్రభుత్వం నవరత్నాలు– పేదలందరికీ ఇళ్లు పథకం ద్వారా అర్హులకు ఇళ్లస్థలాలు, పక్కాగృహాలు మంజూరు చేసింది. గృహ నిర్మాణానికి మూడు విడతల్లో రూ. 1.80 లక్షల బిల్లులు అందజేయడంతో పాటు ఉచితంగా 20 టన్నుల ఇసుక, రాయితీపై సిమెంట్, కడ్డీలు, గృహ నిర్మాణ సామగ్రి అందజేసి పేదలకు సొంతింటి కల నెరవేర్చింది. బేస్‌మట్టం వేసుకునేందుకు చేతిలో డబ్బులులేని లబ్ధిదారులకు వైఎస్సార్ క్రాంతి పథం ద్వారా హౌస్‌లోన్ పర్పస్(హెచ్‌ఎల్‌పీ) ద్వారా రూ. 35వేలు మంజూరు చేసింది. అంతేకాకుండా వివిధ దశల్లో ఉన్న ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసేందుకు ఆర్థిక వెసులుబాటు కల్పించింది. గృహ నిర్మాణం మొదలుపెట్టేందుకు లబ్ధిదారులకు రూ. 20 వేల చొప్పున అడ్వాన్స్ రూపేనా వారి ఖాతాల్లో జమ చేసి ఆదుకుంది. దీంతో పాటు జగన్న కాలనీల్లో ఇళ్లు కట్టుకునే వారికి డీఆర్‌డీఏ, మెప్మా ద్వారా అదనంగా రూ. 50వేలు,అదీ చాలకపోతే లక్ష రూపాయల వరకు రుణం అందించింది. తీసుకున్న అప్పులో రూ. 35 వేల వరకు పావలా వడ్డీ వర్తింపజేసింది. ఎస్సీ, ఎస్టీ స్వయం సహాయక సంఘాలకు(ఉన్నతి) వడ్డీ లేకుండా అదనపు రుణం అందజేసి ఆయా వర్గాల సొంతింటి కల నెరవేర్చింది.
జగనన్న కాలనీలను పట్టించుకోని సర్కారు
గత ప్రభుత్వం జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలకు పెద్ద పీట వేసింది. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఈ తరహాల్లో పేదలకు ఇళ్ల నిర్మాణాలు చేపట్టలేదు. ప్రైవేట్ వెంచర్లను తలదన్నేలా కాలనీలకు ముందు ఆర్చీలు సైతం ఏర్పాటు చేసింది. కాలనీల్లో ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీలు, ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటుకు స్థలాలు సైతం కేటాయించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జగనన్న కాలనీల్లో సమస్యలు తాండవం చేస్తున్నాయి. కాలనీలకు వెళ్లే ప్రధాన రోడ్లతోపాటు అంతర్గత రోడ్ల నిర్మాణాలను పట్టించుకోకపోవడంతో పెద్ద పెద్ద గుంతలు దర్శనమిస్తున్నాయి. పలు కాలనీల్లో వీధి దీపాలు వెలగక ప్రజలు చీకట్లో మగ్గుతున్నారు. కొన్నిచోట్ల ముళ్ల పొదలు పెరిగి విష సర్పాలు సంచరిస్తుండటంతో ఇళ్ల లో నుంచి బయటకొచ్చేందుకు భయపడుతున్నారు.
కోవెలకుంట్లలోని జగనన్న కాలనీలో నిలిచిపోయిన గృహ నిర్మాణాలు
2014 నుంచి 2019 మధ్య కాలంలో అధికారంలో ఉన్న చంద్రబాబు సర్కారు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు. పక్కాగృహాలు మంజూరు చేయలేదు. 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్ల స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి రూ. 4 లక్షలు ఇస్తామని కూటమి పార్టీలు హామీలు గుప్పించాయి. అధికారంలోకి వచ్చి ఆరు నెలలు దాటినా ఇంత వరకు కొత్త ఇళ్ల మంజూరు కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఆన్‌లైన్ సేవలు ప్రారంభించకపోగా గత ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి పలు ఆంక్షలు విధించింది. వచ్చే ఏడాది మార్చిలోపు ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని షరతు విధించింది. ఇప్పటి వరకు ప్రారంభించని ఇళ్ల నిర్మాణాల అనుమతిని రద్దు చేసింది. అధికారంలోకి వచ్చాక కూటమి సర్కారు వ్యవహరిస్తున్న తీరు పట్ల లబ్ధిదారులు గుర్రుగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment