శ్రీశైలంలో పెరిగిన భక్తుల రద్దీ
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం సెలవు రోజును పురస్కరించుకుని ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. వేకువజామున పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లన్న దర్శనానికి క్యూల వద్ద బారులు తీరారు. వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా దేవస్థాన అధికారులు పలు ఏర్పాట్లు చేశారు. ఉచిత కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులకు తాగునీరు, అల్పా హారం, బిస్కెట్లు పంపిణీ చేశారు. కాగా భక్తుల రద్దీతో క్షేత్ర పురవీధులన్నీ కిటకిటలాడాయి.
శ్రీశైలంలో అన్యమత
కార్యకలాపాలు నిషేధం
శ్రీశైలం టెంపుల్: దేవదాయశాఖ నిబంధనలను అనుసరించి శ్రీశైల క్షేత్ర పరిధిలో అన్యమత ప్రచారం, అన్యమతాలకు సంబంధించిన కార్యకలాపాలు, అన్యమత చిహ్నాలు ప్రదర్శనను పూర్తిగా నిషేధించినట్లు శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం శ్రీశైలం ఈఓ మాట్లాడుతూ అన్యమత సూక్తులను, చిహ్నాలను, బోధనలను, అన్యమతానికి సంబంధించిన ఫొటోలు కలిగి ఉన్న వాహనాలు కూడా క్షేత్ర పరిధిలోకి అనుమతించబడవని పేర్కొన్నారు. శ్రీశైల క్షేత్ర పరిధిలో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ అన్యమత ప్రచారాలకు, అన్యమత కార్యక్రమాలకు సహకరించడం కూడా చట్టం ప్రకారం శిక్షార్హమే అని తెలిపారు.
తెలుగుగంగకు నీరు విడుదల
రుద్రవరం: వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయరు నుంచి అధికారులు తెలుగు గంగ కాల్వకు సాగు నీరు విడుదల చేశారు. ఆదివారం రుద్రవరం సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న గండ్లేరు (తుండ్లవాగు) రిజర్వాయరుకు చేరుకుంది. గత నెలలో వెలుగోడు రిజర్వాయరు నుంచి నీటి విడుదలను పూర్తిగా నిలిపివేశారు. దీంతో వరి,మినుము, మొక్క జొన్న తదితర పంటలు సాగు చేసిన రైతులు తీవ్ర ఆందోళన చెందారు. నీరు లేకపోతే పంట పండదని అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో శనివారం రిజర్వాయర్ నుంచి కాల్వకు నీరు విడుదల చేశారు.
నేడు ప్రజా వినతుల స్వీకరణ
నంద్యాల: పట్టణంలోని కలెక్టరేట్ సెంటీనరి హాల్‌లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జరగనుంది. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోనున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9.15 గంటలకు ప్రారంభమయ్యే ఫిర్యాదుల స్వీకరణకు జిల్లా అధికారులందరూ హాజరు కావాలన్నారు. అలాగే జిల్లా కేంద్రంతో పాటు డివిజన్, నియోజకవర్గ, మండల స్థాయిల్లో కూడా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్య క్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.
రేషన్ డీలర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
కర్నూలు(సెంట్రల్): జిల్లాలో 201 డీలర్ పోస్టులను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేసేందుకు కర్నూలు కలెక్టర్ పి.రంజిత్‌బాషా నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఇందులో కర్నూలు డివిజన్‌లో 76, ఆదోని డివిజన్‌లో 80, పత్తికొండ డివిజన్‌లో 45 పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులను రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు పూరించిన అర్జీలను డిసెంబర్ 23 నుంచి డిసెంబర్ 30వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు నేరుగా, లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా సంబంధిత రెవెన్యూ డివిజనల్ అధికారులకు పంపాలి.
Comments
Please login to add a commentAdd a comment