నాపరాతి పరిశ్రమపై భారం తగదు
కొలిమిగుండ్ల: ఇప్పటికే కష్టాల్లో కూరుకుపోయిన నాపరాతి పరిశ్రమపై కూటమి ప్రభుత్వం మరింత భారం వేయడం తగదని మైనింగ్ యజమానులు పేర్కొన్నారు. కన్సిడరేషన్ ఫీజులను భారీగా పెంచడాన్ని నిరసిస్తూ ఆదివారం బందార్లపల్లె క్రాస్ రోడ్డులోని రాయల్టీ చెక్‌పోస్టు సమీపంలో గొర్విమానుపల్లె, తుమ్మలపెంట, అంకిరెడ్డిపల్లె, బందార్లపల్లె,కనకాద్రిపల్లె తదితర గ్రామాలకు చెందిన గనులు, పాలీష్ ఫ్యాక్టరీల యజమానులు, ట్రాక్టర్ డ్రైవర్లు, కార్మికులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. కన్సిడరేషన్ ఫీజు పెంపుతో రాయల్టీ ధరలు పెరిగాయన్నారు. ప్రస్తుతం నాపరాతి పరిశ్రమ ఆదరణ కరువై నష్టాల బాటలో నడుస్తుందన్నారు. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ప్రభుత్వం రాయల్టీ ధర పెంచడం సమంజసం కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిశ్రమపై ఆధారపడి వందలాది కార్మికులు కుటుంబాలు జీవిస్తున్నాయన్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే కాన్పిడరేషన్ ఫీజు తగ్గించాలని, లేకపోతే కార్మికులు వలసలు పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సర్కారు తీరుకు నిరసనగా చెక్‌పోస్టు సమీపంలో మైనింగ్ యజమానులు చేపట్టిన ఆందోళనలో అధిక భాగం కూటమికి చెందిన వారే పాల్గొనడం గమనార్హం.
నేడు నాపరాయి రవాణా ట్రాక్టర్ల సమ్మె
బేతంచెర్ల: పారిశ్రామిక కేంద్రమైన బేతంచెర్ల నాపరాయి పరిశ్రమలకు బనగానపల్లె మండలంలోని పలుగ్రామాల గనుల నుంచి నాపరాయిని తరలించే లారీ, ట్రాక్టర్ యజమానులు సోమవారం సమ్మెకు పిలుపునిచ్చారు. రాయల్టీలు ఆన్‌లైన్‌లో అందుబాటులో లేకపోవడంతో అధికారులు తమకు ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఈ సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగుతున్నట్లు తెలిపారు. ఈనెల 19న రాయల్టీలు లేని కారణంగా నాపరాళ్ల ట్రాక్టర్లను అధికారులు అడ్డుకోవడంతో ట్రాక్టర్, లారీ యజమానులు రోడ్డుపైనే వాహనాలు ఆపి ఆందోళనకు దిగారు. దీంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడటం నాలుగు రోజుల్లో సమస్య పరిష్కారమవుతుందని మైనింగ్ ఏడీ చెప్పడంతో ఆందోళన విరమించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment