ప్రయోగం లేదా..?
● జూనియర్ కళాశాలల్లో ప్రాక్టికల్స్‌కు
నోచుకోని విద్యార్థులు
● ప్రైవేటు కాలేజీల్లో ఇంకా
బూజు దులపని సైన్స్ ల్యాబ్‌లు
● ఆపార్, కేర్‌టేకర్, సంకల్ప్,
ఆన్‌లైన్ డేటా నమోదుతో
సతమతమవుతున్న లెక్చరర్లు
● ఫిబ్రవరి 10 నుంచి
మొదలు కానున్న ప్రాక్టికల్స్
● ఆందోళనలో విద్యార్థులు
జిల్లాలో ఇదీ పరిస్థితి..
జిల్లాలో మొత్తం 135 జూనియర్ కళాశాలలు ఉండగా 28,688 మంది విద్యార్థులు పరీక్ష ఫీజులు చెల్లించారు. ప్రాక్టికల్ పరీక్షలకు 8,552 మంది హాజరుకానున్నారు. వీరిలో ఎంపీసీ గ్రూప్ విద్యార్థులకు ఫిజిక్స్, కెమెస్ట్రీ సబ్జెక్టులు, బైపీసీ గ్రూపు వారికి ఆ రెండింటితో పాటు బొటనీ, జువాలజీ సబ్జెక్టుల్లో ప్రాక్టికల్ జరగనున్నాయి. సబ్జెక్టుకు 30 చొప్పున మార్కులు కేటాయించనున్న విషయం తెలిసిందే. జాతీయ, రాష్ట్రస్థాయిలో నిర్వహించే జేఈఈ, నీట్, ఏపీఈఏపీసెట్ (పాత ఎంసెట్) వంటి ప్రవేశ పరీక్షల్లో ఇంటర్ మార్కులకు వెయిటేజ్ ఉన్న నేపథ్యంలో ప్రాక్టికల్స్ మార్కులకు సైతం ఎనలేని ప్రాధాన్యత సంతరించుకుంది.
నంద్యాల(న్యూటౌన్): ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షల సమయం దగ్గర పడుతుంది. అందుకు ద్వితీయ సంవత్సరం ఎంపీసీ, బైపీసీ చదువుతున్న విద్యార్థులు సిద్ధం కావాల్సి ఉంది.అయితే, ఇప్పటి వరకు కాలేజీల్లో ఎంత వరకు ప్రయోగాలు పూర్తయ్యాయో పరిశీలిస్తే.. ఆశ్చర్యకర విషయాలు వెలుగు చూశాయి. అపార్, కేర్‌టేకర్, సంకల్ప్, ఆన్‌లైన్ డేటా నమోదు వంటి కార్యక్రమాలతో అధ్యాపకులను ప్రభుత్వం నిరంతరం బిజీగా ఉంచడంతో కాలేజీల్లో ప్రయోగాలు చేయించే వీలులేకపోయింది. ఇక ప్రైవేట్ కాలేజీల్లో సైన్స్ ల్యాబ్‌ల బూజు కూడా దులపలేదు. వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే 2025 మార్చి 1 నుంచి థియరీ పబ్లిక్ పరీక్షలు .. సైన్స్ విద్యార్థుల ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 10 నుంచి ప్రారంభమవుతాయని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో అధికారులు త్వరలో ప్రాక్టికల్ పరీక్ష కేంద్రాల కేటాయింపు కోసం జూనియర్ కాలేజీలను పరిశీలించనున్నారు. అక్కడ వసతుల కల్పన, సౌకర్యాల తీరును క్షుణ్ణంగా పరిశీలించి కేంద్రాల కేటాయింపునకు ప్రభుత్వానికి ప్రతిపాదన చేస్తారు.
ప్రభుత్వ కాలేజీల్లో అకడమిక్ వర్కే ఎక్కువ
ప్రభుత్వ యాజమాన్య జూనియర్ కళాశాలల్లో పరిస్థితి గందరగోళంగా ఉంది. అక్కడి లెక్చరర్లకు ఉదయం నుంచి సాయంత్రం వరకు పాఠాల కంటే అకడమిక్ వర్క్‌కే ఎక్కువ సమయం కేటాయించాల్సిన పరిస్థితి ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లెక్చరర్లకు పాఠాలు చెప్పడానికి తీరిక లేని పనులతో ముప్పుతిప్పలు పెడుతోంది. ఒకవైపు అపార్ నమోదు కుదిపేస్తోంది. మరోవైపు సంకల్ప్ పేరిట ప్రత్యేక క్లాసులు, కేర్‌టేకర్ వర్క్, ప్రత్యేకంగా పుస్తకాలు, విద్యార్థుల డేటా నమోదు, ప్రోగ్రెస్ కార్డుల తయారీ, ఆన్‌లైన్‌లో అటెండెన్స్, మార్కుల నమోదు, ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు డేటా తయారీ తదితర పనులను అధ్యాపకులకు అప్పగించింది. దీంతో వారు రెగ్యులర్ క్లాసులకే దూరమవుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులతో ప్రయోగాలు చేయించలేని పరిస్థితి నెలకొంది. వెంటనే ఇంటర్ విద్య కమిషనర్ చొరవ తీసుకుని క్లాసుల బోధన, ప్రాక్టికల్స్ నిర్వహణకు ఆటంకం లేకుండా మార్గదర్శకాలను పునఃసమీక్షించాలని సైన్స్ లెక్చరర్లు విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రిన్సిపాళ్లకు దిశానిర్దేశం చేశాం
ఫిబ్రవరిలో ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయి. జిల్లాలో ఈ పరీక్షల నిర్వహణపై కళాశాలల ప్రిన్సిపాళ్లకు ఇప్పటికే పలుమార్లు దిశానిర్దేశం చేశాం. ప్రిన్సిపాళ్లు చొరవ తీసుకుని విద్యార్థులను బ్యాచ్‌ల వారీగా ప్రతి రోజు ప్రాక్టికల్స్ నిర్వహించాలి. అకడమిక్ పనులు చూసుకుంటూనే ప్రాక్టికల్స్‌కు సన్నద్ధం చేయాలి. ల్యాబ్‌లో కావాల్సిన పరికరాలు, సదుపాయాలు కూడా సమకూర్చుకోవాలి.
–గురువయ్యశెట్టి, ఆర్‌ఐఓ, నంద్యాల
Comments
Please login to add a commentAdd a comment