ఎప్పుడెప్పుడు ఏం జరిగిందంటే..
జనవరిలో..: జగనన్న తోడు కింద వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 8వ విడతలో 14,142మందికి రూ.14.96కోట్ల వడ్డీలేని రుణాలు అందజేసింది. 23వ తేదీ వైఎస్సార్ ఆసరా పథకం కింద 26,012 స్వయం సహాయక సంఘాలకు చెందిన 2,53,077 మహిళా లబ్ధిదారుల ఖాతాల్లో రూ.167.41 కోట్లు జమ చేసి వారి ఆర్థికాభివృద్ధికి దోహదపడింది.
ఫిబ్రవరిలో..: 28వ తేదీ వైఎస్సార్ రైతు భరోసా– పీఎం కిసాన్ కింద రైతులకు వరుసగా ఐదో ఏడాది మూడో విడతగా జిల్లాలో 2,34,151 మందికి రూ.47.06 కోట్ల లబ్ధి చేకూరింది.
మార్చిలో..: మార్చి నెలలో ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని అహోబిలంలో శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. మన రాష్ట్రం నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
● 14వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాలోని బనగానపల్లెకు వచ్చారు. ఇక్కడ వైఎస్సార్ ఈబీసీ నేస్తం మూడవ విడత కింద జిల్లాలో 15,163 మంది మహిళలకు రూ.22.75 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశారు. మూడు విడతలుగా జిల్లాలో 44,292 మంది మహిళలకు రూ.67.60 కోట్ల లబ్ధి చేకూరింది.
ఏప్రిల్, మే, జూన్..: ఈ మూడునెలలను ఎన్నికల మాసంగా చెప్పవచ్చు. ఏప్రిల్, మే అభ్యర్థుల ప్రచారంతో హోరెత్తాయి. ఏప్రిల్ 18వ తేదీన సార్వత్రి ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. 18వ తేదీ నుంచి 25వ తేదీ వరకు పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మే 12వ తేదీన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరిగింది. జూన్ 4వ తేదీన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి.
జూలైలో..: కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలి నెలరోజుల్లోనే నందికొట్కూరు నియోజకవర్గంలోని పగిడ్యాల మండలం ముచ్చుమర్రి గ్రామానికి చెందిన 9 ఏళ్ల బాలిక ఆడుకుంటుండగా అదే గ్రామానికి చెందిన ముగ్గురు బాలలు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై చిన్నారిని చంపేశారు.రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైన ఈ కేసును పోలీసులు ఇప్పటి వరకు ఛేదించలేదు. బాలిక మృతదేహాన్ని కనుగొనలేదు.
సెప్టెంబర్‌లో..: నంద్యాల పట్టణానికి చెందిన ఉపాధ్యాయుడు అహమ్మద్‌ను ట్రేడ్ మార్కెటింగ్ పేరుతో ఇద్దరు వ్యక్తులు రూ. 4.60 లక్షలు పెట్టుబడి పెట్టించి బురిడీ కొట్టించడంతో అతను ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
అక్టోబర్‌లో..: ఆలయాలకు పుట్టినిల్లు అయిన నంద్యాల జిల్లాలో దేవీనవరాత్రోత్సాలు వైభవంగా జరిగాయి. 3వ తేదీ నుంచి 11వ తేదీ వరకు దుర్గాదేవి పలు అలంకారాల్లో భక్తులకు దర్శనమిచ్చారు.
నవంబర్‌లో..: ఎన్నికల సమయంలో చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీ మేరకు తమకు వేతనాలు పెంచాలని నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ఆశా వర్కర్లు ముట్టడించారు.
డిసెంబర్‌లో..: 13వ తేదీన కూటమి ప్రభుత్వంపై రైతులు కన్నెర్ర చేశారు. చంద్రబాబు ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట భారీ ధర్నా చేశారు.
● విద్యుత్ చార్జీల పెంపునకు నిరసనగా ఈనెల 27న వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో పోరుబాటు కార్యక్రమం నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించారు. కూటమి సర్కారుపై ప్రజలు నిరసన తెలిపారు.
ఆగస్టులో..: 3వ తేది శ్రీశైలం నియోజకవర్గం మహానంది మండలం సీతారామపురం గ్రామానికి చెందిన పసుపులేటి సుబ్బరాయుడును అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు బుడ్డారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, నాయకులు దారుణంగా హత్య చేశారు. సుబ్బరాయుడు, ఆయన కుమారులు వైఎస్సార్‌సీపీలో చేరడంతో పాటు ఆయన కుమారుడు నాగప్రసాద్ ఎన్నికల సమయంలో ఏజెంట్‌గా కూర్చోవడంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. 9న మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గ్రామానికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటానని ధైర్యం చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment